నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, ఏప్రిల్ 2023, ఆదివారం

మీ ఆశ్రమంలో ఏమి నేర్పిస్తారు??

ఆశ్రమం పనులు మొదలయ్యి చురుకుగా ముందుకు కదులుతున్నాయి.

గ్రామస్తులలో కుతూహలం పెరుగుతోంది. రకరకాలుగా వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. కొందరైతే మమ్మల్నే అడుగుతున్నారు.

‘యోగాశ్రమం అని పేరు పెట్టారు. డబ్బులు తీసుకొని యోగా నేర్పిస్తారా?’ అడిగింది ఒకామె.

‘మేము డబ్బులూ తీసుకోము, యోగానూ నేర్పించము’ అన్నాను .

‘మరి యోగాశ్రమం అని పేరు పెట్టారు కదా?’ అనుమానం తలెత్తింది ఆమెలో

‘మేము నేర్పే యోగా మీకు అర్ధమయ్యేది కాదు. మీరు చెయ్యగలిగేది కూడా కాదు’ అని ఆమెతో చెప్పాను.

ఇంకొకాయన ఇలా అడిగాడు.

‘చందాలతో ఆశ్రమం కట్టిస్తున్నారా?’

‘మేము చందాలు తీసుకోము’ అని చెప్పాను

అతను నోరెళ్ళబెట్టాడు

‘మేము కూడా చందాలేసుకుని అమ్మవారికి తిరునాళ్ళు చేస్తాము. సంబరాలు చేస్తాము. బ్రహ్మంగారి తిధికి ఊరందరికీ భోజనాలు పెడతాము’ అన్నాడు.

‘మేము అటువంటి పనులు  పొరపాటున కూడా చెయ్యము’ అన్నాను

‘అంటే మీలో మీరే ఉంటారా?’ అడిగాడాయన

‘అంతే. మాలో మేమే ఉంటాము, మా కష్టార్జితాలతో ఆశ్రమం కట్టుకుంటున్నాము.  మా మార్గంలో నడిచేవాళ్ళకే అందులో ప్రవేశం. బయటివాళ్ళకు ప్రవేశం లేదు’ అన్నాను.

'ఇంతమాత్రం దానికి ఆశ్రమం ఎందుకు?' అన్నట్టు చూశాడాయన.

ఇంకొకాయన ఇలా అడిగాడు.

‘ముసలోళ్ళని చేర్చుకుంటారా?’

మాది వృద్ధాశ్రమం అని అతను అనుకుంటున్నాడని నాకర్ధమైంది.

‘అంటే?’ అన్నాను అర్ధం కానట్టు

‘మా ఇంట్లో ముసలోళ్ళున్నారు. ఆశ్రమానికి పంపచ్చా?’ అడిగాడు సిగ్గు లేకుండా.

‘ఎవరు మీ అమ్మా నాన్నానా?’ అడిగాను.

‘అవును. మా అత్తా మామా కూడా ఉన్నారు’ అన్నాడు.

‘చేర్చుకుంటాము. ఒక్కొక్కళ్ళకి నెలకి లక్ష అవుతుంది. పైగా ముసలోళ్ళతో గొడ్డుచాకిరీ చేయిస్తాము. ఊరకే కూచోపెట్టము’ అన్నాను సీరియస్ గా.

‘అంతెందుకవుతుంది?’ అన్నాడు.

‘ఎందుక్కాదు? ఏసీ రూములు, అన్ని సౌకర్యాలు,  ప్రతిరోజూ బిరియానీ, వీకెండ్ లో చికెన్ మటన్, అప్పుడప్పుడు మందు, ఇవన్నీ ఉంటాయి. ఇవిగాక రోజుకి మూడు సినిమాలు చూపిస్తాము, కాదామరి? అయినంత అవుతుంది. మిగతాది మాకు డొనేషన్’ అన్నాను.

మళ్ళీ తిరిగి చూస్తే ఒట్టు.

ఇంకొకామె ఇలా అడిగింది.

‘మీ ఆశ్రమంలో ఏమి నేర్పిస్తారు?’

‘అన్నీ నేర్పిస్తాము. నేర్చుకోగలిగితే’ అన్నాను 

'అంటే ?' అడిగిందామె. 

'అంటే, మీరు పద్ధతిగా ఉంటే మా దగ్గర అన్నీ ఉంటాయి. మీరు తీరుగా లేకపోతే మా దగ్గర మీకేమీ దొరకదు' అన్నాను.

'అసలు మీ మార్గమేంటి”’ అడిగింది ఆమె మళ్ళీ.

‘అది కొద్దిమాటల్లో చెప్పేది కాదు. చెప్పినా మీకు అర్ధం కూడా కాదు’ అన్నాను.

నిన్న ఒకతను ఆటోలో వచ్చాడు.

‘ఆశ్రమంలో వాచ్ మ్యాన్ కావాలా?’ అడిగాడు నడుం మీద చేతులేసుకుని పోజిచ్చి నిలబడి.

ఆటో మీద ‘యెహోవా నా కాపరి’ అని రాసుంది.

‘నీకే ఒక కాపరున్నాడు. నువ్వు మాకేం కాపలా కాస్తావులే, వద్దు’ అన్నాము.

ఇంకొక గొడ్లు కాసుకునే ముసలోడు ' పొలిమేరలో పొలం కొన్నారు. ఈడ రేత్తిరిపూట బూత వైజ్జకాలు సేత్తాంటారు. జాగర్త' అని భయపెట్టబోయాడు.

'బూతాలతో ఆడుకోటం మాకు సరదా. మా ఆశ్రమంలో రేత్తిరైతే శానా బూతాలు తిరుగుతాంటై. నువ్వీ శాయలకి రామాక' అన్నా సీరియస్ గా.

ముసలోడు పరార్.   

‘అవసరమైతే తప్ప పనివాళ్ళని పెట్టుకోరు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఒకళ్ళ జోలికి రారు. వాళ్ళలో వాళ్ళే ఉంటారు’ అని ఒక అభిప్రాయం గ్రామస్తులలో పడిపోయింది.

అయితే, 'ఈ ఆశ్రమంలో ఉంటూ వీళ్ళు ఏం చెయ్యబోతున్నారు?’ అన్నది మాత్రం  ఎవరికీ అర్ధం కావడం లేదు.

ముందు మాకర్ధమైతే కదా వాళ్ళకి చెప్పడానికి?