నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

1, మే 2023, సోమవారం

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన

నిన్న వైశాఖ శుద్ధ దశమి.

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగా పిలువబడే బ్రహ్మంగారు సజీవ సమాధిలో ప్రవేశించిన రోజు. ఈ సంఘటన 1693 CE లో జరిగింది. ఈ సంఘటనను స్మరిస్తూ బ్రహ్మంగారి భక్తులు ప్రతి ఏడాదీ ఈ రోజున బ్రహ్మంగారి ఆరాధనను చేస్తారు. 

ఇక్కడ దొడ్డవరం గ్రామంలో బ్రహ్మం గారి భక్తులు చాలామంది ఉన్నారు. బ్రహ్మం గారి గుళ్ళు రెండు మూడున్నాయి. వాటిలో పాత గుడిలో నిన్నంతా ఆరాధనలు జరిగాయి. మొన్న రాత్రి బ్రహ్మంగారి పద్యనాటకం వేశారు. కుల మత భేదం లేకుండా, ఊరి జనాభా మొత్తానికీ రెండుపూటలు అన్నసంతర్పణ చేశారు.

ప్రసుతం మేము అద్దెకుంటున్న ఇంటివాళ్ళ పెద్దబ్బాయి ఈ కార్యక్రమాన్ని గత 20 ఏళ్ళ నుంచీ జరిపిస్తున్నాడు. ఇది ఎంతో మంచి విషయం. నాకు బాగా నచ్చింది.

ఒక మహాయోగిగా బ్రహ్మంగారిని నా చిన్నప్పటి నుంచీ నేను ఎంతో గౌరవిస్తాను. బ్రహ్మంగారి గురించి నేను మొదటిసారిగా 1976 లో తెలుసుకున్నాను. అప్పటికి ఒక ఏడాది ముందు 1975 లో రాజమండ్రిలో కొన్ని యోగాసనాలను 12 ఏళ్ళ వయసులో నేర్చుకున్నప్పటికీ, మొదటిసారిగా అన్ని ఆసనాలను ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర‘ అనే పుస్తకంలోనే 1976 లో చూశాను. అభ్యాసం మొదలుపెట్టాను. అప్పట్లోనే పల్లెటూర్లలో రాత్రంతా ప్రదర్శించే బ్రహ్మంగారి నాటకాన్ని చూడటం, ఆయన జీవితచరిత్రను చదవడం జరిగింది. యోగసాంప్రదాయంతో నా పరిచయం అలా మొదలైంది. అప్పటికీ ఇప్పటికీ 45 ఏళ్ళు గడిచాయి. నా యోగసాధన అనేక పుంతలు తొక్కుతూ ముందుకు సాగింది. బ్రహ్మంగారి పైన నా గౌరవం  కాలంతో బాటు పెరుగుతూ వచ్చింది.

నేడు, మా ఆశ్రమం వచ్చిన దొడ్డవరం గ్రామంలో చూస్తే, బ్రహ్మంగారి గుడులు  మూడున్నాయి. ఆయన ఆరాధనను నిష్ఠగా చేసే గ్రామస్తులున్నారు. బ్రహ్మంగారి గుడి ఉన్న బొడ్డురాయి ప్రక్కనుంచే మా ఆశ్రమానికి పోయే దారి ఉంటుంది. ఇదంతా కాకతాళీయం కాదని నేను నమ్ముతున్నాను. 

బ్రహ్మంగారి చరిత్రను పరిశీలిస్తే, ఆయన తన సంచారంలో భాగంగా అద్దంకి, ధేనువకొండలకు వచ్చినట్లు తెలుస్తున్నది. ధేనువకొండ గ్రామం మాకు కేవలం పది నిముషాల దూరం మాత్రమే.

NTR తీసిన బ్రహ్మంగారి చరిత్ర సినిమాను నేను 1984 లో గుంతకల్ లో చూశాను. ఆ సినిమా షూటింగ్ రాయలసీమలోనే జరిగింది. ఆ షూటింగ్ లో నా తోటి ఉద్యోగులు కొంతమంది నటించారు కూడా. షూటింగ్ చూద్దామని వాళ్ళు కందిమల్లాయపల్లి వెళితే, నటులు తక్కువయ్యారని గ్రామస్తులుగా వేషాలు వీళ్ళకే వేయించి వీళ్ళనే  సినిమాలో పెట్టాడు NTR. ఆ సినిమాకు నేను పోయిన రోజున, గుంతకల్ లో ఉండే శ్రీ శంకరానందగిరి స్వాములవారు కూడా సినిమాహాలుకు వచ్చి బాక్స్ లో కూచుని ఆ సినిమాను చూచారు. నేను దర్శించిన బ్రహ్మజ్ఞానులలో ఆయన ఒకరు.

అయితే ఆ సినిమా నన్ను నిరాశపరచింది. NTR కు తోచిన రీతిలో ఆ సినిమా వాస్తవ వక్రీకరణకు గురయింది. అది నాకు నచ్చలేదు. జనాకర్షణ కోసం చరిత్రను మార్చాడాయన. 'అతి'నటన కూడా చేశాడు. అందుకే ఆ సినిమాను రెండవసారి నేను చూడలేదు. ఆ సినిమాను ఇంకా బాగా, వాస్తవాలకు దగ్గరగా తీసి ఉండవచ్చుననేది నా అభిప్రాయం. 

తరువాత నేను గుంటూరు డివిజన్ లో పనిచేసినప్పుడు, నంద్యాల యర్రగుంట్ల లైన్ వేస్తున్న సమయంలో, బనగానపల్లెలో బ్రహ్మంగారి సమాధిని దర్శించాను. వారి వంశస్తులను చూచి నిరాశ చెందాను. కారణం? ఆయన శక్తి వారిలో కనిపించకపోవడం.

వేదాంత, యోగ, తంత్ర సంప్రదాయాలను సమన్వయం చేసి  ఆచరణాత్మకమైన సిద్ధమార్గాన్ని రాయలసీమలోను, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల లోని పల్లెపట్టులలోను బహుళ ప్రచారం చేసిన మహాయోగిగా బ్రహ్మంగారిని నేను అమితంగా గౌరవిస్తాను. హిందూమతం యొక్క ఆచరణాత్మక యోగవిధానాలు గ్రామ్యప్రాంతాలలో ఇంకా బ్రతికి ఉన్నాయంటే అది బ్రహ్మంగారి చలవే. మా మార్గం కూడా అదే కాబట్టి మా ఆశ్రమంలోని ధ్యానమందిరంలో బ్రహ్మంగారి చిత్రపటాన్ని కూడా ఉంచబోతున్నాను. 

బ్రహ్మంగారిని ఆరాధించినంత వరకూ, SC, ST, BC లను క్రైస్తవం తాకలేకపోయింది. ఆయనను మరచిన తర్వాతనే పల్లెల్లో అది ఎక్కువైంది. ఇది వాస్తవం.

బ్రహ్మంగారి తత్త్వాలన్నా, బ్రహ్మంగారి నాటకమన్నా నాకు చాలా ఇష్టం. అందుకే మొన్న రాత్రి తెల్లవారుజాము 4 వరకూ, ఎద్దులబండి వేదికగా  ఇక్కడ సాగిన ఆ పద్యనాటకం నాకు చాలా ఆనందాన్ని కలిగించి, నా చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చింది. తెలుగునాట పల్లెటూర్ల జీవితాన్ని మళ్ళీ ఆస్వాదించే అవకాశం ఇన్నాళ్ళకు మళ్ళీ నాకు ఈ విధంగా లభించింది.

పండితులలాగా ఉత్తమాటలు ఉపన్యాసాలు చెప్పడం కాకుండా, దైవశక్తిని, అమానుష యోగశక్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపి, కుల మతాలకు అతీతమైన వేదాంతతత్త్వాన్ని ఆచరణలో నిరూపించిన మహాయోగి - బ్రహ్మంగారు. అసలైన హిందూమతాన్ని నిలబెట్టినది ఇటువంటి మహనీయులే. సాంఖ్యము, తారక రాజయోగము, అమనస్కము, కుండలినీ యోగములకు ఆయన జీవితమే ప్రత్యక్ష నిదర్శనం.

అయితే, ఉత్తగా ఏడాదికొకసారి ఆయన ఆరాధనను చేసి ఊరుకోవడమో, లేదా ఆయనను తమ కులానికే పరిమితమైన మహనీయునిగా భావించి ఒక గుడి కట్టి ఒదిలేయడమో నేను హర్షించను. ఆయన చూపిన సమగ్రమైన యోగమార్గంలో నడచి ఆయా సమాధిస్థితులను డైరెక్ట్ గా అందుకోవడము, ఆయా అమానుష యోగశక్తులను సాధించి, అవసరమైతే ప్రదర్శించి చూపగలగడమే ఆయనకు మనం చేయగల అసలైన ఆరాధన అని నేను నమ్ముతాను. దానినే మా ఆశ్రమంలో అనుసరిస్తున్నాము. బోధిస్తున్నాము.  

ఆయన చూపిన యోగమార్గంలో నడుస్తున్న మేము, ఆయన ఆరాధింపబడుతున్న గ్రామానికి, ఆయన సంచరించిన ప్రాంతానికి చేరుకోవడం ఆయన అనుగ్రహం గానే భావిస్తున్నాను.

అందరూ నమ్ముతున్నట్లు వేమనయోగి రెడ్డికులానికి ప్రతీక అని, బ్రహ్మంగారు విశ్వబ్రాహ్మణ కులానికి ప్రతీక అని నేను నమ్మను. వారిది యోగికులం. అది కులమతాలకు అతీతమైన ఋషికులం. నిజమైన మహనీయులందరిదీ అదే కులం.

అందుకనే, ఆచరణాత్మక యోగసాధనకు పెద్దపీటను వేసే మా ఆశ్రమంలో, శ్రీ రామకృష్ణులవారు, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగార్లతో బాటు, బ్రహ్మంగారి చిత్రపటాన్ని కూడా ఉంచి పూజించబోతున్నాము. 

ఇదే మేము చేయబోతున్న బ్రహ్మంగారి ఆరాధన. ఈ ఆరాధన ఏడాది కొకసారి జరిగేది కాదు. అనుక్షణం జరిగేది. ఇదే అసలైన ఆరాధన అనేది మా నమ్మకం.