నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, మే 2023, ఆదివారం

ఏకనిష్ఠా లోపం

హిందువులలో ఏకనిష్టా లోపం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో నేను ముస్లిములను చాలా మెచ్చుకుంటాను. ఖర్మమో ధర్మమో వాళ్ళు నమ్మినదాన్ని గట్టిగా పట్టుకుంటారు.. రెండోదాన్ని దగ్గరకు రానివ్వరు. అది మూర్ఖత్వం అయినప్పటికీ, వారి ఏకనిష్ఠ మాత్రం మెచ్చుకోదగినది.

ఇకపోతే, హిందువులలో విశాలభావనలు ఎక్కువ. 'పోన్లే పాపం' అని ప్రతిదాన్నీ ఒప్పుకుంటారు. అయితే, వారిలో ఉన్న ఈ అతి విశాలత్వమే వారికి శాపంగా మారి కూచుంది. ఎలాగో చెప్తా వినండి.

మొన్నొకరోజున ఒక దేవాలయ పూజారి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన నరసింహాలయ పూజారి. కానీ వాళ్ళ ఇంటి పూజామందిరంలో హిందూ దేవతలతో బాటు షిరిడీ సాయిబాబా ఫోటో  కూడా పూజలందుకుంటోంది.

అది గమనించి మేము ముఖముఖాలు చూసుకున్నాం.

మా శ్రీమతైతే, 'ఏంటండీ మీరు ఈయన్ని పూజిస్తున్నారు? అని అడగనే అడిగింది.

దానికా ఇంటి ఆడవారు, 'ఏమైంది ఆయనకూడా దేవుడేగా?' అని జవాబు చెప్పారు. 

'ఏసుక్రీస్తు కూడా దేవుడని చాలామంది అమాయకులు నమ్ముతారు. ఆయన ఫోటో కూడా పెట్టుకోండి. రేపటినుంచీ చర్చికెళ్లి పార్ధన చెయ్యండి. ఆ తర్వాత మసీదుకు వెళ్లి నమాజ్ కూడా చెయ్యండి' అందామని నోటిదాకా వచ్చింది. 

పరిచయమైన మొదటిరోజునే వీళ్లకు విశ్వరూపసందర్శనం ఇవ్వడం ఎందుకని నవ్వేసి ఊరుకున్నాము 

సామాన్యంగా వైష్ణవ పూజారులు శివలింగాన్ని శివుని ఫోటోలను కూడా ఇంట్లో ఉంచుకోరు అలాంటిది వీళ్ళు ఏకంగా సాయిబాబా ఫొటోను పూజామందిరంలో పెట్టేశారు. బ్రాహ్మణ పూజారుల ఇంట్లో సాయిబాబా ఫోటోనా? ఖర్మరా దేవుడా అనిపించింది. వీళ్ళ అమాయకత్వానికి, దిగజారుడుతనానికి చాలా జాలేసింది.

'నరసింహస్వామి ఉపాసనలోని అద్భుతాలు అర్ధమైతే వీళ్ళు ఇలా ఎందుకుంటారు?' అనిపించింది. 

నేటి పూజారులు ఉద్యోగులయ్యారు. వ్యాపారులయ్యారు. దళారులయ్యారు. ఉపాసకులు మాత్రం కాలేకపోతున్నారు. అందుకే ఇలా ఉంది. వాళ్ళు పూజిస్తున్న దేవత వాళ్ళకు ప్రసన్నమై ఉండాలి. పిలిస్తే పలికేలాగా ఉండాలి. అప్పుడు ఇంతమందిని పూజించే పని ఉండదు.

పూజారులే ఇలా ఉంటే, ఇక సామాన్య హిందువులకు వీళ్ళేం చెప్పగలుగుతారు? పూజారులూ చెప్పక, స్వామీజీలూ చెప్పక,  గురువులూ చెప్పక, ఎవరూ చెప్పక, మరోపక్క పరాయి మతాల ప్రలోభాలు ప్రచారాలతో సామాన్య హిందువు ఏమవుతాడు? ఎవడేది చెబితే దానిని నిజమనుకుంటాడు. అందుకే పరిస్థితి ఇలా ఉంది.

నాకేమీ సాయిబాబా అంటే ద్వేషం లేదు  ఈ సంగతి ఇంతకు ముందు కూడా చాలాసార్లు వ్రాశాను. కానీ ఆయన్ని దేవుడిని చేసి కూచోబెట్టి గుడులు కట్టి పూజలు చెయ్యడం తప్పని అంటాను. ఆయనొక ముస్లిం సాధువు. ఇంకా చెప్పాలంటే, 'సాధువు' అనికూడా ఆయనను అనకూడదు.  ఆయనకు చాలా కోపం ఉండేది. కాబట్టి ఆయనొక ఫకీరు. అంతే. అంతవరకే ఆయన్ను గౌరవిద్దాం. దానికి మించి అవసరం లేదని నా అభిప్రాయం. నా ఈ అభిప్రాయానికి ధార్మిక, చారిత్రక, వాస్తవిక ఆధారాలున్నాయి.

హిందూమతం ఇలాగే రానురాను భ్రష్టు పడుతోంది.

ఇంతకీ సాయిబాబాను నమ్మేవాళ్లు చెప్పే కారణాలేంటి? 'అనుకున్న పనులు అవుతాయి. గురువారం గుడికెళ్తే చాలు అన్నీ బాబానే చూసుకుంటాడు' అంటారు. ఇంతకంటే పిచ్చిభ్రమ ఇంకోటి లేదని నేనంటాను.

పనులు కావడానికి పరాయి మతాల సాధువులను నువ్వు పూజించనక్కరలేదు. అలా ఆలోచిస్తున్నావంటే అసలు  హిందూమతపు మూలసిద్ధాంతాలే నీకర్ధం కాలేదని అర్ధం. పల్లెటూరిలో పోలేరమ్మను నమ్మినవాడికి కూడా పనులు అవుతాయి. ఎన్నో నిదర్శనాలు పల్లెటూర్లలో ఈనాటికీ ఉన్నాయి.  అసలు ఏ దేవుడిని నమ్మని నాస్తికుడికి కూడా పనులు అవుతాయి. తన మీద తన నమ్మకమే వాడికి రక్ష.

దేవుడి విలువ నీ పనులు కావడం మీద ఆధారపడి లేదు. అలా ఉందని భావించే చవకబారు మనుషులే రోజుకొక దేవుడిని మారుస్తుంటారు మతాలు మారుతుంటారు ఎన్ని చేసినా వాళ్ళు చివరకు 'అడుక్కునే వాళ్ళు' గానే ఉండిపోతారు గాని ఆధ్యాత్మికంగా ఎదగలేరు.

అడుక్కునేవాడు అంతేకదా? 'ఆ బజార్లో అడుక్కుంటే బాగా తిండి దొరుకుతుంది, ఈ బజార్లో దొరకదు' అనుకుని పదిబజార్లు తిరుగుతూ చివరకు బేజారై పోతూ ఉంటాడు. వాడు తినే రెండుముద్దల తిండికి ఏ బజారైనా ఒకటే అన్న సంగతి వాడికి అర్ధం కాదు. ఈలోపల వాడి ఆత్మగౌరవం హరీమంటుంది.. ఆఫ్ కోర్స్ ఆడుక్కునేవాడికి ఆత్మగౌరవం ఎక్కడేడుస్తుంది గనుక?

పరమతసహనం పట్లుతప్పి మరీ ఎక్కువైతే ఇలాగే ఉంటుంది. పరమత సహనం మంచిదే. కాదనను. కానీ పరాయిమతాల సాధువులను ఫకీర్లను మన దేవుళ్ళుగా చేసుకోవడం మాత్రం నా దృష్టిలో ఆత్మద్రోహమే కాదు, ధర్మద్రోహం కూడా. వాళ్ళను గౌరవిద్దాం. కానీ ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుదాం. మన నమ్మకాలను, మన ధర్మాన్ని మనం వదలకుండా ఉందాం. అదీ అసలైన హిందుత్వమంటే !

ఈ సున్నితమైన విభజనరేఖను మర్చిపోతున్నంతవరకూ హిందువులలో ఆధ్యాత్మిక చైతన్యం గాని, ఔన్నత్యం గాని,  ఏనాటికీ రాదనేది నా నమ్మకం.

ఏకనిష్ఠ లేకపోవడమే దీనికంతటికీ గల ప్రధానమైన కారణం.

ఇతర మతస్తులు హిందువులను చూసి నవ్వుతున్నారంటే నవ్వరూ మరి !

నేడొకటి, రేపొకటి, ఎల్లుండి ఇంకొకటి. మీలో ఏకనిష్ఠ ఏదీ?