Pages - Menu

Pages

15, జులై 2023, శనివారం

చేపలు తినేవాళ్లు దైవాత్ములెలా అవుతారు? ఇస్కాన్ స్వామీజీల అజ్ఞానం

వివేకానందస్వామి చేపలు తిన్నారు గనుక ఆయన దివ్యాత్ముడు కాదని ఇస్కాన్ కు చెందిన అమోఘ్ లీలాదాస్ అనే సాధువు అన్నాడు. అంతేగాక, వివేకానందుల గురువైన శ్రీ రామకృష్ణులను కూడా విమర్శించాడు. శ్రీ రామకృష్ణులు 'యతో మత్ తతో పథ్' అని బెంగాలీలో అనేవారు. అంటే, 'ఎన్ని మతములో అన్ని మార్గాలు (మతాలన్నీ ఒకే దైవాన్ని చేరే వేర్వేరు దారులు)' అని అర్ధం. ఇది సరికాదని, అన్ని మతాలు ఒకే చోటకు చేర్చవని అమోఘ్ లీలాదాస్ అన్నాడు. ఈ వ్యాఖ్యను ఆయన బెంగాల్లోని పానీహాటి అనే ఊర్లో ఒక మీటింగులో మాట్లాడుతూ చేశాడు. దానితో పెద్ద గొడవ చెలరేగింది.

బెంగాల్లో రామకృష్ణులను ప్రతి ఇంటిలోనూ పూజిస్తారు. పూజామందిరంలో ఆయన ఫోటో లేని ఇల్లు ఆ రాష్ట్రంలో ఉండదు. ఇక వివేకానందస్వామి అంటే చెప్పనే అక్కర్లేదు. కలియుగంలో ఆయన లేని హిందూమతాన్ని ఊహించలేం. ఈ వ్యాఖ్యలతో బెంగాలీలు మండిపడ్డారు. దుమారం రేగింది. ఇస్కాన్ దిగి వచ్చింది. లీలాదాస్ ను నెలపాటు సస్పెండ్ చేసింది. ఎవరికీ ముఖం చూపకుండా ఏకాంతవాసం చెయ్యమని ఆదేశించింది. ఆయన సరేనంటూ బృందావనం వెళ్ళిపోయాడు.

బేలూర్ మఠాన్ని దర్శించి  రామకృష్ణా మిషన్ కు క్షమార్పణ చెబుతామని ఇస్కాన్ ప్రకటన చేసింది. ఇది మంచి నిర్ణయం. అసలైన విజ్ఞతకు ఇది నిదర్శనం.

ఈ అమోఘ్ లీలాదాస్ అనే సాధువుకు దాదాపు 41 ఏళ్ళుంటాయి. ఈయన ఒక సాఫ్ట్ వేర్ నిపుణుడు. ముప్పై ఏళ్ల వయసులో ఇస్కాన్ లో చేరాడు. ప్రస్తుతం ద్వారకా నగరం లోని ఇస్కాన్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. యూట్యూబ్ లో మంచి పేరున్న వక్త. కానీ, నోరు జారిన పాపానికి ఈ శిక్ష పడింది. మంచిదే.

చేతిలో మైకుంది కదా అని, యూ ట్యూబ్ సెలెబ్రిటీని కదా అని, నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు.  రామకృష్ణ వివేకానందుల స్థాయిని లీలాదాస్ లాంటి కుర్రసన్నాసులు అర్ధం చేసుకోలేరు. అంత నోటి దూలగా ఉంటే, చాపక్రింద నీరులాగా పాకుతున్న క్రైస్తవం పైనా,  జిహాద్ పేరుతో నానా ఘోరాలు దౌర్ణన్యాలు నేరాలు చేస్తున్న ఇస్లాం పైనా మాట్లాడి ఉండవలసింది.  అంతేగాని, తనకు అర్ధం కాని స్థాయి మనుషుల గురించి ఈ విధంగా మాట్లాడటం లీలా దాస్ చేసిన ఘోరమైన తప్పు.

ప్రస్తుతం జరగవలసిన యుద్ధం క్రైస్తవం పైనా, ఇస్లాం పైనా మాత్రమే. ప్రతి ఒక్కరికీ ఈ రెండు మతాలు భారతదేశానికి చేస్తున్న ద్రోహం ఏమిటో తెలియాలి. ఇవి ఎలాంటి విషపు మతాలో, ఎలాంటి విష ప్రచారాలు చేస్తున్నాయో తెలియాలి. ఆ కోణంలో అందరికీ సమాచారం అందాలి., చర్చలు జరగాలి. జ్ఞానం పెరగాలి. అంతేగాని ఇలాంటి అపరిపక్వ వ్యాఖ్యలు చెయ్యకూడదు.

లీలాదాస్ లాంటి మనుషులకు కొన్ని విషయాలు గుర్తు చెయ్యదలుచుకున్నాను.

1. మనం అవతార పురుషులుగా పూజించే శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు ఇద్దరూ మాంసాహారులే. ఇస్కాన్ వాళ్ళు జపించే 'హరేరామ హరేకృష్ణ' మహామంత్రంలో వీళ్ళిద్దరే ఉంటారు.

2.  అహింసామూర్తి అని లోకంలోని అజ్ఞానులు చాలామంది భావించే బుద్ధుడు మాంసాహారి. పందిమాంసం  తినడం వల్ల జరిగిన ఫుడ్ పాయిజనింగ్ తో బుద్ధుడు చనిపోయాడు.

3. మన ప్రాచీన ఋషులందరూ మాంసాహారులే.

మాంసం తింటేనే దైవత్వం వస్తుంది అనేది నా ఉద్దేశ్యం కాదు. తిండికీ దైవత్వానికి సంబంధం లేదని చెప్పడమే నా ఉద్దేశ్యం.

ఇంకా సాధకదశలో ఉండి, తపస్సు చేస్తున్న వాళ్ళు ఆహారనియమం తప్పక పాటించాలి. సిద్ధస్థితిని పొందినవారికి ఈ నియమం వర్తించదు. ఈ విషయం లీలాదాస్ కు తెలియదు లాగుంది.

రామకృష్ణ, వివేకానందుల జీవితాలను లీలాదాస్ లాంటి వాళ్ళు ముందు శ్రద్దగా చదవాలి. ఆ తరువాత మాట్లాడాలి.

'నరేంద్రుడు (వివేకానందస్వామి) స్నేహితులతో కలసి ఒక హోటల్లో చికెన్ తిన్నాడు' అని శ్రీ రామకృష్ణులతో ఇంకొక శిష్యుడు ఫిర్యాదు చేస్తాడు.

'నరేంద్రుడు అగ్ని వంటివాడు. అగ్నిని ఏదీ అపవిత్రం చేయలేదు. అందులో పడిన ప్రతిదీ భస్మం అయిపోతుంది' అని శ్రీ రామకృష్ణులు జవాబిచ్చారు.

అంతేకాదు. ఆయన ఆ వ్యక్తితో ఇలా అన్నారు, 'ఇదే పనిని నువ్వు చేసి ఉంటే, జన్మలో మళ్ళీ నీ ముఖం చూసి ఉండేవాడిని కాను'.

సద్గురువులు అందరికీ ఒకే నియమం పెట్టరు. ఎవరి స్థాయి ఏమిటో చూచి దానికనుగుణంగా వారికి నియమాలను నిర్దేశిస్తారు. నరేంద్రుడు సప్తఋషులలో ఒకడని, ధర్మోద్ధరణ కోసం తనతో ఈ భూమికి దిగి వచ్చాడని శ్రీ రామకృష్ణులు అనేకసార్లు అనేవారు. సప్తఋషులంటే సామాన్యులు కారు. భగవంతునికి ఉన్న శక్తులు వీరికి కూడా ఉంటాయి. వారు శాపానుగ్రహ సమర్థులు. సంకల్పమాత్రంతో ఎదుటి మనిషి తలవ్రాతను మార్చగల శక్తి వారికి ఉంటుంది. వివేకానంద స్వామిది ఆ స్థాయి.

వివేకానందుడు చేపలు తిన్నాడని, బుద్ధుడు పందిమాంసం తిన్నాడని మనం కూడా ట్రై చెయ్యకూడదు. శంకరులు, బ్రహ్మంగారు మద్యం త్రాగారని మనం త్రాగకూడదు. మనం వాళ్ళతో సమానం కాము, కాలేము. లీలాదాస్ అసలే చెయ్యకూడదు. ఆయన మరమరాలు తిని, నీళ్లు త్రాగి  మాత్రమే జీవించాలి. అప్పుడే ఆ నోటి దూల తగ్గుతుంది.

వివేకానంద స్వామి చేపలు, చికెన్ తిన్నది నిజమే. అయితే, ఉత్త మంచినీళ్ళు మాత్రమే త్రాగుతూ వారం రోజులపాటు నిరాహారిగా కూడా ఆయన ఉన్నాడు. శ్రీ రామకృష్ణుల నిర్యాణం తరువాత, పరివ్రాజకదశలో దేశమంతా తిరుగుతున్న దశలో ఇది జరిగింది. హిమాలయాలలో ఉన్నపుడు ఎన్నో రోజులపాటు ఆహారం దొరకని స్థితిలో ఆయనున్నాడు. ఈ విషయాలు లీలాదాస్ తెలుసుకోవాలి.

ఇస్కాన్ సాధువులకు, భక్తులకు మరొక్క విషయం గుర్తు చేస్తాను.

వారు పరమపవిత్రంగా, సాత్వికాహారంగా భావించే ఆవుపాలు కూడా సైన్స్ ప్రకారం మాంసంతో సమానమే.  పాలు వెజిటేరియన్ డైట్ కాదు. అది జంతువు నుండి వచ్చిన ఆహారం, పాలను సైన్స్ 'లిక్విడ్ మీట్' అంటుంది. పాలు త్రాగుతూ, అదేదో గొప్ప ఆహారనియమమని, సాత్వికాహారం తింటున్నామని అనుకునే వారు పిచ్చి భ్రమలో ఉన్నట్లే. మాంసం తినేవారికి, పాలు త్రాగేవారికీ పెద్ద తేడా ఏమీ లేదు. అందుకే వీగన్స్, పాలతో సహా అన్ని రకాలైన జంతు ఉత్పత్తులకూ దూరంగా ఉంటారు.

టెక్నికల్ గా చూస్తే,  పాలతో చేసిన స్వీట్లు,  పాలకోవా మొదలైనవి కూడా మాంసాహారంతో సమానమే.

పైగా, దూడలకు అవి తాగినన్ని పాలు ఉంచనిస్తే, మనం త్రాగడానికి పాలెలా వస్తాయి? కాబట్టి మనం త్రాగుతున్న పాలన్నీ దూడల నోటి దగ్గర కూడే. అవి త్రాగవలసిన పాలను, మనం లాక్కొని త్రాగుతున్నాం. సత్యంగా చెప్పాలంటే ఇది మహాపాపాల్లో ఒకటి. మరి పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించే ఇస్కాన్ సాధువులు, భక్తులు అందరూ మహాపాపం చేస్తున్నట్లే. 

చేపలు తిన్నంత మాత్రాన దైవత్వం దూరమైతే, పాలు త్రాగేవారికి, స్వీట్లు తినేవారికి మాత్రం అదెలా వస్తుంది?

మరోమాట !

బెంగాల్ శక్తి ఉపాసనకు నిలయం. కాళికాదేవికి మాంసాన్ని నైవేద్యంగా పెడతారు. భైరవునికి మద్యాన్ని నైవేద్యం పెడతారు. అదీగాక, బెంగాల్లో చేపలను శాకాహారంగా భావిస్తారు. అక్కడ బ్రాహ్మణులు కూడా చేపలను తింటారు. చేప కూర లేనిదే బెంగాలీలకు, వారు ఏ కులం వారైనా, పూట గడవదు.

ప్రాచీనకాలంలో బ్రాహ్మణులందరూ మాంసాహారులే. మధ్యయుగాల లోనే వారు శాకాహారులయ్యారు.

అసలు ఏ ప్రాణినీ హింసించకూడదంటే, ఉత్తగాలిని మాత్రమే పీల్చి బ్రతకాలి. ఇంకా చెప్పాలంటే, ఆ గాలిలో కూడా కొన్ని సూక్ష్మజీవులుంటాయి. అవీ చనిపోతాయి. నీళ్లలో బోలెడన్ని సూక్ష్మజీవులుంటాయి. నీటిని త్రాగితే అవికూడా చనిపోతాయి. కనుక, అహింసను నిక్కచ్చిగా పాటించాలంటే, మనం చనిపోవడం ఒక్కటే దారి. అంతకంటే వేరే మార్గం లేదు.

అహింసయే పరమధర్మం అనుకునే పనైతే లీలాదాస్ అర్జంటుగా కృష్ణభక్తిని విడిచిపెట్టి జైన సాధువుగా మారాలి. ఏమంటే,  ఒక్క జైనసాధువులు మాత్రమే, బ్రతికుంటే ఏదో ఒక జీవిని చంపవలసి వస్తుంది కాబట్టి,  ప్రాయోపవేశం అనే దీక్షను పట్టి ఉపవాసం ఉంటూ తమంతట తాముగా చనిపోతారు. కానీ ఇది కూడా అత్యున్నతమైన జ్ఞానానికి సూచిక కాదు. దీనిని బుద్దుడు నిరసించాడు. ఆత్మహత్య మహాపాపమని సనాతన ధర్మం కూడా అంటుంది. 

కాబట్టి తత్త్వం సరిగ్గా అర్ధం కావడం అనేది యూ ట్యూబ్ లో వీడియోలు పెట్టినంత చీప్ విషయం ఏమీ కాదు.

'కాషాయం కట్టినంత మాత్రాన తత్త్వం అర్ధం కాదు' అనడానికి అమోఘ్ లీలాదాస్ లాంటి కుర్రసాధువులే ఉదాహరణ. యూ ట్యూబ్ మాయలో పడి, కామెంట్లు లైకులు చూసుకుంటూ అదే ఏదో గొప్ప విజయంగా భావిస్తున్నంతవరకూ నిజమైన సన్యాసం ఎలా వంటపడుతుంది మరి?

బృందావనంలో ఉంటూ నెలరోజులు మౌనవ్రతం పాటించినంత మాత్రాన ఎవరికీ జ్ఞానోదయం కాదు. అలా అయ్యే పనైతే, ఈపాటికి వేలాది లక్షలాది జ్ఞానులు ఎప్పుడో తయారై ఉండేవారు. జీవితాంతం అక్కడ ఉంటున్నవాళ్లకే దిక్కూ దివాణం లేదు. ఒక్క నెలకే ఏమొస్తుంది లీలా దాస్?

అసలు వాక్కు మీద అదుపు రాకుండానే ఈయనకు సన్యాసం ఇచ్చిన ఇస్కాన్ గురువులది తప్పు. ఇప్పుడు ఆన్లైన్ దీక్షలు, ఆన్లైన్ సన్యాసం కూడా వచ్చాయట ఆన్లైన్ మోక్షం ఒక్కటే తక్కువ. కలిమాయలలో ఇదీ ఒకటి !! 

బృందావనంలో మౌనదీక్షకు బదులుగా, మా ఆశ్రమంలో నెలపాటు మా అతిథిగా ఉంటే చాలు. అసలైన ఆధ్యాత్మికత ఏమిటో రుచి చూపిస్తాను. ప్రయత్నించమని లీలాదాస్ కు ఆఫర్ ఇస్తున్నాను.

ఆయనకు నిజంగా జ్ఞానోదయమే కావాలి అనుకుంటే ఇది సువర్ణావకాశం. ఉత్త యూ ట్యూబ్ సెలబ్రిటీ స్టేటస్ చాలు అనుకుంటే ఆయనిష్టం.

శాకాహారం జ్ఞానసిద్ధికి సూచిక కాదు. అలాగని మాంసాహారాన్ని మానలేని వారికి జ్ఞానం ఎన్ని జన్మలకూ కలగదు.

ఇంత చిన్న విషయం అర్థం కావడానికి పెద్ద జ్ఞానం ఏమీ అవసరం లేదు.