Pages - Menu

Pages

24, జులై 2023, సోమవారం

కాశీలో ఆరు నెలలు - చేదు సత్యాలు

నిన్న ఒక పాత ఫ్రెండ్ నుంచి ఫోనొచ్చింది.

కుశల ప్రశ్నలయ్యాక, 'మీ బ్లాగ్ చూస్తున్నాను' అన్నాడు, అదేదో నన్నుద్ధరిస్తున్నట్టు.

'అది నీ అదృష్టం' అన్నాను తడుముకోకుండా.

హర్టయ్యాడు. బిస్కెట్  పని చెయ్యలేదుగా మరి?

'ఆరు నెలలు కాశీలో ఉండి ఈ మధ్యనే తిరిగొచ్చాము నేనూ నా భార్యా' అన్నాడు, అలాగైనా మెచ్చుకుంటానేమో అని !

'ఎందుకెళ్ళావు? ఎందుకు తిరిగొచ్చావు?' అన్నాను.

'అక్కడే చనిపోతే మోక్షం కదా? అందుకెళ్లాను. ఉండలేక తిరిగొచ్చాను' అన్నాడు.

'ఏం మోక్షం అంటే ముఖం మొత్తిందా? తిరిగొచ్చావ్' అడిగాను నవ్వుతూ.

కంగారు పడ్డాడు. 

'ఆబ్బే అదికాదు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముందు అర్ధం కాదు. వెళ్లిన తర్వాత అర్ధమౌతుంది. ఏదో రెండ్రోజులు వెళ్ళొస్తే బానే ఉంటుంది. ఆరు నెలలో ఏడాదో ఉండాలని వెళితే మాత్రం అప్పుడు తెలుస్తుంది. అక్కడ నీళ్లు తిండి పడక సిక్కై  పోయాము ఇద్దరమూ' అన్నాడు.

'అవును. ఇంకోటి కూడా ఉంది' అన్నాను.

'ఏమిటది?' అన్నాడు.

'ఎవరైనా ముందుగా చెబితే అర్ధం కాదు. అనుభవిస్తేనే తెలుస్తుంది ఏదైనా' అన్నాను.

'అంతేలే' అన్నాడు ఇంకేమీ అనలేక.

గత పదేళ్లుగా నేను ఏదైతే చెబుతున్నానో అది తిరిగి నాకే వల్లిస్తున్నాడు అనుభవంతో.

ఇంకొక బిస్కెట్ వేద్దామని అనుకున్నాడో ఏమో, 'మీ ఆశ్రమం వివరాలు చూస్తున్నాను. అక్కడకొకసారి వచ్చి చూద్దామని ఉంది. కానీ రాలేక పోతున్నాను. మా ఆవిడకు హెల్త్ బాగోదు. ఆవిడను డాక్టర్ల చుట్టూ తిప్పడం, మందులు తెచ్చివ్వడమే సరిపోతోంది. రిటైర్ అయ్యాక  ఏదో చేద్దామని అనుకున్నాను. కానీ ఏదీ సాగడం లేదు' అన్నాడు.

అలలు ఆగాక స్నానం చేద్దామంటే సముద్రంలో అలలెప్పుడు ఆగుతాయి?

ముసుగులో గుద్దులాట ఎందుకని, 'నువ్వు మా ఆశ్రమం చూట్టానికి రావద్దు' అన్నాను డైరెక్ట్ గా.

మళ్ళీ హర్టయ్యాడు, 'అదేంటి అలా అంటున్నావ్?' అడిగాడు కొంచం కోపంగా.

'అవును మరి. ఇక్కడ మినిమమ్ సౌకర్యాలు కూడా ఉండవు. నువ్వు నిరాశపడతావు. పొద్దున్నే చెంబు తీసుకుని పొలాలలోకి వెళ్ళాలి. అలా ఉంటుంది. పైగా, కాశీలో ఆర్నెల్లు ఉండి వచ్చావు. ఏం ఒరిగింది? మా ఆశ్రమానికి వచ్చినా అంతే. వస్తావు. నీ బురదను నాకు అంటిస్తావు. ఉన్నంతసేపు రాజకీయాలు, సోది గాసిప్ మాట్లాడతావు. ఒక్కరోజుకే నీకు విసుగు పుడుతుంది. నిన్ను భరించలేక, పది నిముషాలకే నాకు విసుగు పుడుతుంది. వస్తావు పోతావు. ఏమీ అందుకోలేవు. ఇంకెందుకు రావడం?' అన్నాను.

తను పిచ్చోడేమీ కాదు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ లో మంచి పొజిషన్ లోనే రిటైరయ్యాడు. ఇలా కాదని ఇంకో రూట్లో కొచ్చాడు.

'మరి నీ ఆశ్రమం ఎందుకు పెట్టావో అసలు? అన్నాడు.

మనమేమీ తక్కువ తినలేదుగా !

'అది నీలాంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం పెట్టలేదు. బ్లాక్ మనీ బాగా మూలుగుతున్న బ్లాక్ క్యాట్స్ కోసం  పెట్టాను. ఎవడైనా రాజకీయ నాయకుడు దొరుకుతాడేమో అతనికి బినామీగా అండర్ గ్రౌండ్ లో బంగారం స్టాక్ చేద్దామని పెట్టాను' అన్నాను.

మా ఫ్రెండ్ గతంలో సత్యసాయికి వీరభక్తుడు !

అప్పుడు తగ్గాడు.

'మరి నా గతేంటి? ఈ జీవితం ఇంతేనా?' అన్నాడు.

'ఇంతగాక, మళ్ళీ యవ్వనం తిరిగొస్తుందని అనుకుంటున్నావా? అలాంటివేవీ జరగవు. కావాలంటే ఊరకాకి లేహ్యం వాడుకో' అన్నాను నవ్వుతూ,

'ఛ అదికాదు, ఆధ్యాత్మికంగా ఇంతేనా అని అడుగుతున్నాను' అన్నాడు.

'ఇంతగాక ఇంకేముంటుంది? నీ జీవితమంతా డబ్బు, ఆస్తులు, ప్రమోషన్లు అంటూ బ్రతికి, ఇప్పుడు అరవై దాటాక 'నా ఆధ్యాత్మిక జీవితం ఇంతేనా? నా గతేంటి?' అంటూ నంగినంగి మాటలు మాట్లాడితే ఉపయోగమేముంటుంది? నీ జీవితమంతా ఏం చేశావో అదే నీకిప్పుడు  మిగులుతుంది. కొత్తగా ఏమీ రాదు. కాశీలు రామేశ్వరాలు తిరుగు, వద్దనను. కానీ అవి వేరు. ఆధ్యాత్మికం వేరు. ఆధ్యాత్మికం చిన్నతనంలోనే ఉండాలి. ముదిరాక రమ్మంటే రాదు. ఇప్పుడు నువ్వేమీ చెయ్యలేవు. ప్రస్తుతం మీ ఆవిడకు సేవ చెయ్యి. ఆ  తరువాత నువ్వూ మూలపడతావు. అప్పుడు నీకు నువ్వే సేవలు చేసుకో. లేదా వృద్ధాశ్రమంలో చేరు. అన్నీ సక్రమంగా ఉంటే,  వచ్చే జన్మలో చూద్దాం. ఇంతకంటే ఎక్కువ  ఆశించకు. ఈ జన్మకింతే' అన్నాను.

'అదేంటి అంత ఘోరంగా మాట్లాడుతున్నావ్?' అన్నాడు.

'ఉన్నమాట చెబితే అలాగే ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు లైఫంతా బ్రతికి చివర్లో కాశీలో సెటిలై మోక్షం కొట్టేద్దామనుకుంటే, ఈశ్వరుడేమీ తెలివిలేనివాడు కాదు. ఆశకైనా అంతుండాలి' అన్నాను.

'మరిప్పుడు నన్నేం చెయ్యమంటావో చెప్పు. నువ్వు చెప్పినట్టే చేస్తాను' అన్నాడు చివరికి.

'నేను చెప్పనూ అక్కర్లేదు. నువ్వు చెయ్యనూ అక్కర్లేదు. అరవై దాటాక నువ్వు చేసేదేముంది చెక్కభజన? నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. ఆశ్రమానికి మాత్రం రావద్దు.  నన్ను డిస్టర్బ్ చెయ్యద్దు' అనేశాను.   

మా ఇద్దరి పరిచయం ఇప్పటిది కాదు. నలభై ఏళ్ల నాటిది. నా కాలేజీ రోజుల నుంచీ మాకు పరిచయం ఉంది. నా ధోరణి అప్పటినుంచీ అతనికి తెలుసు. కానీ పట్టించుకునేవాడు కాదు. నా వ్రాతలు మాత్రం గత పదేళ్లనుంచీ చదువుతున్నాడు. ఇప్పుడేమో ఇలా అడుగుతున్నాడు. ఇలాంటివాళ్లకు ఇంతకంటే   ఏం చెప్పాలి?

'చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే. ప్రస్తుతం నువ్వేమీ చెయ్యలేవు. మీ ఆవిడకు సేవ చేసుకో.  నీ ఆరోగ్యం చూసుకో. మిగతా టైం ఎలాగూ యూ ట్యూబ్ లోనే ఉంటావు, అది నాకూ తెలుసు నీకూ తెలుసు. ఈ జన్మ ఇలాగే గడవనీ. నీ అదృష్టం బాగుంటే వచ్చే జన్మలో నన్ను ఎర్లీగా కలుస్తావు. ఇంకా బాగుంటే, నేనేం చెబుతున్నానో అర్ధం చేసుకుంటావు. అనుసరించే ప్రయత్నం చేస్తావు. ప్రస్తుతానికి నీకా ఛాన్స్ లేదు. అంతే' అని చెప్పి ఫోన్ కట్ చేశాను.

జీవితం చాలా విచిత్రమైనది. ఇదుగో అదుగో అని చూసేలోపు అంతా అయిపోయి అరవై వచ్చేస్తాయి. ఇంకో పదేళ్లలో చరిత్ర ముగుస్తుంది. అప్పుడు లబోదిబో అంటే ఉపయోగమేముంటుంది? బాధ్యతలు  తీరిపోతే,  ఓపికున్నన్నాళ్లు తీర్ధయాత్రలు  తిరగడం, తీరకపోతే తీరలేదని బాధపడటం, తర్వాత పిల్లలు పట్టించుకోవడం లేదని ఏడవడం, రోగాలతో మూలగడం, ఆ తర్వాత వృద్ధాశ్రమంలో  చేరి చావడం ఇది తప్ప ఏ చరిత్ర చూసినా ఇంకేముంటుంది?

ఆధ్యాత్మికం కావాలట ! ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చేదా అది?

ఆధ్యాత్మికం అంటే తీర్థయాత్రలు, పిక్నిక్కులు కాదు. హృదయంలో దైవానుభూతిని పొందటం. జీవితంలో దాన్ని నింపుకోవడం. అప్పుడు యాత్రలు చేసినా, అక్కడ దేవతాశక్తులను అనుభూతి చెందవచ్చు. అలా కాకుండా, ఊరకే పిక్నిక్ లాగా యాత్రలకు పోతే ఏమీ ఒరగదు.

'ఇక్కడుంటే అక్కడుంది. ఇక్కడ లేకపోతే అక్కడా లేదు' అని శ్రీ రామకృష్ణులు చెప్పినది ఇదే.

సత్యాలన్నీ ఇలాగే చేదుగానే ఉంటాయి మరి !