Pages - Menu

Pages

22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

వినాయక చవితి ఇలాగా జరుపుకునేది?

మొన్న జిల్లెళ్ళమూడిలో ఉన్నాము. కొంతమంది కుర్రాళ్లు వచ్చి వినాయకచవితి చందా అడిగారు. ముఖాలు చూస్తే, అల్లరిచిల్లరగా తిరిగే వాళ్ళలాగా ఉన్నారు.  ఇవ్వను పొమ్మని చెప్పాను.

'ఎందుకివ్వరు?' అడిగాడు ఒక అబ్బాయి.

'మేము వినాయక చవితి చెయ్యం. నాకు నమ్మకం లేదు' అన్నాను.

ఎగాదిగా చూసి వెళ్లిపోయారు వాళ్ళు.

తరువాత తెలిసింది. తాగి తందనాలాడే ఒక బ్యాచ్ ఈ ఊళ్ళో కూడా ఉందని.

పందిళ్లు లేచాయి. మైకులు మొదలయ్యాయి. 'గణ నాయకాయ ధీమహి' అంటూ మొదలై 'ఒసోసి పిల్లకొడి పెట్టా', ' పుట్టింటోళ్లు తరిమేశారు ' అంటూ 'ఆ అంటే అమలాపురం' మీదుగా 'నువ్ కావాలయ్యా' వరకూ సినిమాపాటలు పెద్ద హోరుతో నాలుగురోజుల పాటు నడిచాయి. నిమజ్ఙనం రోజున డీజే తో ఊరంతా దద్దరిల్లింది. కుర్రాళ్ళు పెద్దలు అందరూ తాగి రంగులు చల్లుకుంటూ ఎగురుతూ గోల గోల చేశారు. తెల్లవార్లూ సినిమాలు వేశారు. ఊర్లో ఎవరికీ రాత్రంతా నిద్ర లేదు. 

లోకల్స్ ని అడిగాను, 'ఆ గోల అసలైన హిందూమతం కాదు. అలా సినిమా పాటలు పెట్టి వినాయకుడి ఎదురుగా ఎగరడం చాలా తప్పురా. అలా చెయ్యకండి' అని  మీరు ఆ కుర్రాళ్ళకి చెప్పచ్చు కదా అని. 

'చెప్పినా వాళ్ళు వినరు' అన్నారు పెద్దలు.

ఎందుకంటే ఆ సోకాల్డ్ పెద్దలు కూడా ఇంకొక వినాయకుడి విగ్రహం పెట్టి, తమ వంతుగా వాళ్ళూ ఒక మైకు పెట్టారు. అక్కడ కూడా సినిమా పాటలు మోగుతున్నాయి.

గేదె చేలో మేస్తుంటే దూడ గట్టుమీద ఎందుకుంటుంది?

సోకాల్డ్ పెద్దలకే హిందూమతం అంటే ఏంటో సరియైన అవగాహన లేదు. ఇక పిల్లలకు వీళ్ళేం చెప్పగలరు?

'నాలుగు బజార్లున్న చిన్న ఊరిలో నాలుగు వినాయకుడి బొమ్మలెందుకు? అందరూ సమిష్టిగా చెయ్యచ్చు కదా? పైగా అమ్మగారి  ఆలయం ఉన్న ఊర్లో ఇన్ని గ్రూపు లేంటి? ఒక్కటిగా ఉండొచ్చు కదా?' అడిగాను.

'అది కుదరదు. ఎవరి కులం వారిదే. ఎవరి పూజ వారిదే. ఎవరి సంబరం వారిదే' అని జవాబు వచ్చింది.

'మిమ్మలిని బాగుచెయ్యడం ఆ దేవుడి తరం కూడా కాదురా మూర్ఖుల్లారా' అనుకున్నాను.

చివరిరోజున లడ్డు వేలంపాట జరిగింది. ఖర్చులు పోను తాగుళ్ళకు తందనాలకు ఆర్గనైజర్స్ కి    బానే మిగిలింది.

నాలుగు రోజుల పాటు దాక్కునే ఉన్నాను. మా ఇంట్లో నుండి బయటకే రాలేదు. ఏదైనా పని ఉండి బయటకు వస్తే, వినాయకుడి పందిళ్ళవైపు తల కూడా త్రిప్పి చూడలేదు. అంత చీదరేసింది.

'మీరే ఇంత సౌండుతో మైకులు పెడుతున్నారు. రేపట్నించీ చర్చి, మసీదు  వాళ్ళూ మైకులు పెడతారు. దీనికి అంతెక్కడుంది?' అడిగాను.

'మేం పెట్టకపోయినా వాళ్ళు పెడతారు. ఇక మేమెందుకు తగ్గాలి?' అన్నాడాయన.

పల్లెలంటే ఏవో ప్రశాంతమైన ప్రదేశాలని గతంలో అనుకునేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి అలా లేదు.

నేటి పల్లెటూరు అంటే -  సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పాయిజనింగ్, మైండ్ పొల్యూషన్, వెరసి నరకం. ఒక రకంగా పల్లెలకంటే సిటీలే బాగున్నాయి. అక్కడ కొంచెం కాకపోతే కొంచమైనా డీసెన్సీ ఉంటుంది.

అసహ్యంతో జిల్లెళ్ళమూడి నుంచి పారిపోయి, నిన్న పొద్దున్నే దొడ్డవరం వచ్చేశాము.

ఇక్కడ చూస్తే, అక్కడకంటే ఇంకా ఘోరంగా ఉంది.

నాలుగు గుళ్ళలో నాలుగు మైకులు ఉదయం అయిదు నుండి రాత్రి పదిదాకా మోగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఒక పందిరి, అందులో ఒక వినాయకుడి బొమ్మ, అక్కడెవరూ ఉండరు. మైకు మాత్రం పక్కఊరికి వినిపించేలాగ మోగుతూ ఉంటుంది.

లవకుశ, భూకైలాస్ ల నుంచి మొదలుపెట్టి అడవిరాముడు, యమగోల, వేటగాడు, ఆటగాడు, డ్రైవర్ రాముడు ఇలా నేటి జైలర్ వరకు అన్నీ పాటలూ మారుమోగుతున్నాయి. దాని పక్కనే కూచున్న పల్లెటూరి మొద్దులు అంతకంటే పెద్దగా అరుస్తూ రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు.

ఎక్కడికక్కడ కులగ్రూపులు, రాజకీయ గ్రూపులు, పంతాలు. పట్టింపులు. గొడవలు ఒకడిని మించి మరొకరు గొప్ప చూపించుకోవాలని మైకు ఫుల్ సౌండ్ పెట్టడం. అక్కడ మాత్రం ఎవడూ ఉండడు. సినిమా పాటలను వింటూ వినాయకుడు మాత్రం మౌనంగా కూచుని ఉంటాడు.

ఒక వినాయకుడిని 'ఏంటి ఈ ఘోరం? హిందూమతం అంటే ఇంత ఛండాలమా? ఒక్కడికి కాకుంటే ఒక్కడికి కూడా సివిక్ సెన్స్ లేదా? నీ పూజ ఇంత లేకిగానా చెయ్యవలసింది?' అడిగాను.

ఆయన నవ్వాడు.

'హిందూమతం చండాలం కాదు. ఈ మూర్ఖపు మనుషులు దరిద్రులు. అంతే. అత్యున్నతమైన ఫిలాసఫీ ఉన్న  హిందూమతాన్ని రోడ్లమీద వెకిలి డాన్సులుగా మార్చారు. ఎవరెన్ని చెప్పినా వీళ్లు  మారరు, ఇదింతే' అన్నాడాయన.

'మీరు చెప్పి మార్చవచ్చు కదా?' అడిగాను.

'ఎవరు చెప్పినా వినే స్థితిలో ఈ మూర్ఖులు లేరు. వీళ్లకు సివిక్ సెన్స్ నేర్పడం బ్రహ్మదేవుని తరం కూడా కాదు. ఇక అసలైన హిందూమతం వీళ్లకు ఎక్కడ అర్థమవుతుంది?' అన్నాడాయన.

ఇక్కడ మా ఇల్లు ఒక సెంటర్లోనే ఉంటుంది. ఇంతలో ఒక ఊరేగింపు అటుగా వచ్చింది. వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు.

చుట్టూ డప్పులు వాయించేవాళ్ళు నిలబడి పెద్ద సౌండుతో 'కావాలయ్యా నువ్వు కావాలి. రా రా రా' అంటూ డప్పులు వాయిస్తున్నారు. మధ్యలో కొజ్జావాళ్ళు రంగులు పూసుకుని ఎగురుతున్నారు. వాళ్ళ చుట్టూ చిన్నపిల్లలు కూడా రంగులు పూసుకుని వెకిలిగా ఎగురుతున్నారు. దారిన పోయేవాళ్ళకు కూడా పూస్తున్నారు. 

చూస్తేనే ఒళ్ళంతా కంపరం ఎత్తింది. ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాను.

మైకులు, పెద్ద హోరుతో సినిమా పాటలు, వెకిలి డాన్సులు, అర్ధం లేని పూజలు, కొలుపులు, తినడం త్రాగడం, కుల రాజకీయాలు -  ఇదా హిందూమతం.? ఛీ !

చెప్పేవాళ్ళూ లేరు. చెప్పినా వినేవాళ్ళూ లేరు. దొమ్మరిసంత లాగా ఉంది.

ఈ ఊరి మొత్తం మీద 13 వినాయకుడి బొమ్మలు పెట్టారట. 13 పందిళ్ళలో  13 మైకులు మోగుతున్నాయి. ఫుల్ బాటిళ్లు కేసులు కేసులు తెచ్చారట. అన్నీ అయిపోయాయని ఊరివాళ్లు చెప్పారు.

ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది. తాగటానికి తినటానికి తందనాలకు పండుగలు ఒక సాకులా మారాయి. వీటి అసలైన అర్ధాలు గంగలో కలిసిపోయాయి.

పాపులర్ హిందూమతం ఒక వెకిలిగోల ! ఇక్కడ అసలైన తత్త్వం లేదు. నేలబారు చవకబారు అసహ్యపు గోల, స్వార్ధాలు తప్ప ఏమీ లేదు !

మామూలు మనుషులు జరుపుకునే విధంగా వినాయకచవితి గాని, ఇతర పండుగలు కానీ జరుపుకోవడం నేను మానేసి పాతికేళ్ళు దాటింది. కారణం ఇదే. ఈ పండుగలంటేనే నాకు చీదర పుట్టింది.

హిందూమతం ఎంత దిగజారిన స్థితిలో ఉందో చెప్పడానికి ఈ పండుగలు, వాటిని జరుపుకునే విధానాలే తార్కాణాలు. ఈ లేకిపండుగలు ఎంత త్వరగా మాయమైతే హిందూమతానికి అంత మంచిది.

ఇలాంటివి చూసే ఇతర మతాలవాళ్లు మనల్ని మన ఆచారాలను చాలా అసహ్యంగా విమర్శిస్తున్నారు. మన అసలైన ఆచారాలు ఇవి కావు. వేదాంతపు పునాదులు మాయమైతే, ఆచారాలూ పండుగలు అన్నీ ప్రాణం లేని తంతులై పోతాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది.

వినాయకచవితి అనేది కల్పశాస్త్రానికి చెందిన ఒక వ్రతం. నియమనిష్టలతో  దానిని ఆచరించాలి. అంతేగానీ రోడ్లమీద జాతర చెయ్యకూడదు.

వినాయకుడు ఓంకారస్వరూపుడు. ఓంకారోపాసన ద్వారా ఆయన్ను ఆరాధించాలి. అంతేగానీ, ఈ విధమైన వెకిలి సెలబ్రేషన్ తో కాదు.

విఘ్నేశ్వర ఉపాసనను రోడ్ సైడ్ రికార్డింగ్ డాన్స్ గా మార్చకండిరా దరిద్రుల్లారా!

హిందూమతంలోని తాత్వికచింతన సమాజంలోకి రావాలి. అత్యున్నతములైన వేదాంతసత్యాలు సామాన్యులకు కూడా అర్ధం కావాలి. అవి జీవితంలోకి అనువదింపబడాలి. అప్పుడే ఈ వెకిలి పోకడలు మాయమౌతాయి.

అప్పటివరకూ ఈ సమాజం ఇంతే. ఇలాగే చవకబారు వెకిలి ఆచరణలలో కాలం గడుపుతూ, అదే పెద్ద గొప్పగా భావిస్తూ, రోడ్లమీద డాన్సులేసుకుంటూ ఉండవలసిందే.