Pages - Menu

Pages

31, అక్టోబర్ 2023, మంగళవారం

అగమ్య పయనం

ప్రతి చంటిపాప లోనూ ఒక అన్వేషణ

ప్రతి కంటిచూపు లోనూ ఒక ఆవేదన

ఈ అన్వేషణ దేనికోసం?

ఈ ఆవేదన ఎందుకోసం?


ప్రతి మనిషి బ్రతుకూ ఒక వెలితే

ప్రతి మనసు లోనూ ఒక చరితే

ఈ బ్రతుకు లెందుకోసం?

ఈ మనసుకేది  గమ్యం?


ప్రతి కాలూ పయనిస్తూనే ఉంది

ప్రతి కన్నూ పరికిస్తూనే ఉంది

ఈ పయనాలెక్కడికి?

ఈ పరికింపు దేనికని?


ప్రతి రోజూ ఆయువును తరిగిస్తుంది

ప్రతి మోజూ ఓపికను కరిగిస్తుంది

ఈ రోజుల రహస్యమేమిటి?

ఈ మోజుల అసహ్యమెప్పటికి?


ప్రతి వేకువా ఒక వెలుగును తెస్తుంది

ప్రతి వెన్నెలా ఒక జిలుగుల నిస్తుంది

ఈ వేకువలెంత సేపు?

ఈ వెన్నెల లెంతవరకు?


ప్రతి జీవితమూ చావునే వరిస్తుంది

ప్రతి మరణమూ ఒక జన్మను తెరుస్తుంది

ఈ జీవి పయనం దేనికోసం?

ఈ జన్మవలయం ఎంతకాలం?