నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

3, నవంబర్ 2023, శుక్రవారం

నవంబర్ 22 న మా ఆశ్రమం ప్రారంభం

అమెరికా నుండి తిరిగి వచ్చాక, గత ఏప్రిల్ నెలనుంచి ప్రకాశంజిల్లా దొడ్డవరం గ్రామంలో ఉంటూ, చండ్రపాడు గ్రామపరిధిలో మా ఆశ్రమాన్ని కట్టిస్తున్నామని మీకందరికీ తెలుసు. నిరాడంబరంగా కట్టబడుతున్న ఈ ఆశ్రమం దాదాపుగా పూర్తి కావచ్చింది.

పన్నెండేళ్ల నుంచి మేము కంటున్న కల ఇప్పటికి నిజం కాబోతున్నది.

ఇన్నాళ్లుగా నా వ్రాతలను, మాటలను నమ్మినవాళ్లున్నారు. నమ్మనివాళ్ళూ ఉన్నారు. నమ్మినవాళ్లలో కొందరు నాతోపాటు మా ఆశ్రమంలో జీవిస్తూ, నా సాధనామార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిలో కొందరు అమెరికాలో తమ ఉద్యోగాలను కూడా వదిలేసి మరీ ఈ జీవితాన్ని వరించి ఇండియాకు వచ్చేశారు. మరికొందరు వారివారి ఉద్యోగాలలో  మాకు దూరంగా ఉన్నప్పటికీ, నా మార్గంలోనే నడుస్తున్నారు. నా శిష్యులలో అవినీతి పరులు గానీ, సోమరిపోతులు గానీ, దురహంకారులు   గానీ లేరు.

ఇకపోతే, నమ్మనివాళ్ళ సంగతి నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అది వాళ్ళ ఇష్టం.

అయితే, ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా, నేను చెప్పినదానిని మాత్రం చేసి చూపిస్తున్నాను. దానికి ఈ ఆశ్రమమే తార్కాణం.

ఈ నెల 22 న మా ఆశ్రమ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇదే మీకందరికీ ఆహ్వానం. 

ప్రకాశం జిల్లా వెల్లంపల్లి డ్యామ్ దగ్గరలోని దొడ్డవరం - చండ్రపాడు గ్రామాల మధ్యలో మా ఆశ్రమం ఉంటుంది. ఇదే బ్లాగులోని గూగుల్ మ్యాప్ లో మా లొకేషన్ ను  మీరు చూడవచ్చు.

గత పదేళ్లుగా ఎంతోమంది నన్ను కలవాలని, నాతో మాట్లాడాలని, నా దారిలో నడవాలని, దానికి నా గైడెన్స్ తీసుకుంటామని, వారి వారి ఉత్సుకతను వెలిబుచ్చారు. దానికి సమయం రాలేదని  చెప్పి వారిని ఆపుతూ వచ్చాను. ఇప్పటికి ఆ సమయం వచ్చింది. వారందరికీ ఇదే మా ఆహ్వానం.

పూజలు, పునస్కారాలు, పార్ట్ టైం దీక్షలు, గుడులు, భజనలు, యాత్రలు, ప్రవచనాలు మొదలైన తక్కువస్థాయి పనుల జోలికి పోనివారు, దురహంకారం లేనివారు, నిజమైన ఆధ్యాత్మికజీవనం కోసం తపించేవారు,  వేదాంత-యోగ-తంత్ర సాధనామార్గంలో నడవాలనుకునేవారు, డైరెక్ట్ గా ఈ జన్మలోనే దైవానుభూతిని కోరుకునేవారు, ఎవరైనా సరే, వారికి ఇదే మా ఆహ్వానం.

22 వ తేదీన  ఉదయం పదింటికి  ఆశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలౌతుంది. దాదాపు మూడుగంటల పాటు కార్యక్రమం ఉంటుంది. వచ్చినవారికి లంచ్ ఏర్పాటు చెయ్యబడుతుంది. వస్తున్నవారు 15 వ తేదీ లోపు 98493-89249 అనే నెంబర్ కు ఫోన్ చేసి 'పంచవటి ఫౌండేషన్' సెక్రటరీ శ్రీరామమూర్తి కి తెలియజేస్తే ఏర్పాట్లు చేసుకోవడం మాకు తేలికగా ఉంటుంది.

ప్రారంభోత్సవ ఉత్సవాలు వారం రోజుల పాటు వరుసగా జరుగుతాయి. ఈ వారం పాటు నా శిష్యులందరూ ఇక్కడే ఉండి  ప్రతిరోజూ జరిగే స్పిరిట్యువల్ రిట్రీట్ లో పాల్గొంటారు. బయటివారికి మాత్రం ప్రస్తుతానికి ఆ అవకాశం లేదు. ఏమంటే, ఇప్పటికి వారు మా దారిలో లేరు కాబట్టి. మాతో పరిచయం పెంచుకుని, నా సాధనా మార్గంలో నడవడానికి వారి త్రికరణశుద్ధిని నిరూపించుకుంటే మాత్రమే, రాబోయే రిట్రీట్స్ లో వారికి అవకాశం ఇవ్వబడుతుంది.

ఇంతకు ముందే నేను చెప్పినట్లుగా, ఈ రిట్రీట్స్ లో - వేదాంత, యోగ, తంత్ర, జ్యోతిష రహస్యాలు, ఆచరణాత్మకంగా, సింపుల్ గా, నేర్పబడతాయి. కావాలంటే హోమియోపతి, మార్షల్ ఆర్ట్స్ కూడా,  మీకు ఉపయోగపడే పరిధిలో నేర్పబడతాయి. తపన ఒక్కటే  దీనికి కావలసిన అర్హత, కులంతో, మతంతో, డబ్బుతో, హోదాతో,  వయసుతో, రాజకీయాలతో  మా మార్గానికి ఎటువంటి సంబంధమూ లేదు. అసలైన హిందూమతాన్ని, దాని కోర్ ఫిలాసఫీని, దాని సాధనామార్గాలను ఆచరణాత్మకంగా నేర్చుకుని అభ్యసించాలనుకునే వారు, దైవసాధనా మార్గంలో నిజంగా నడవాలనుకునేవారు అందరూ దీనికి అర్హులే.

ఆశ్రమ ప్రారంభోత్సవానికి రావాలని అనుకుంటున్న వారు, ఫోన్ ద్వారా ముందుగా  మాకు తెలియబరచడం  మాత్రం మర్చిపోకండి.

ఇన్నాళ్లు థియరీ చెప్పాను. ఇప్పుడు ప్రాక్టికల్ సాధనలు మొదలౌతాయి.

దివ్యజీవన మార్గంలోకి ఇదే మీకు ఆహ్వానం.

నవంబర్ 22 న కలుసుకుందాం !