Pages - Menu

Pages

6, నవంబర్ 2023, సోమవారం

అన్నదానం చేస్తున్నాం చందా ఇవ్వండి

మొన్నొక రోజున ఆశ్రమంలో పనులలో ఉండగా ఇద్దరు అయ్యప్ప స్వాములు వచ్చారు. మా కట్టుబడి మేస్త్రీ కూడా అయ్యప్ప స్వామే. గురుస్వామి కూడా. 

అతనికోసం వచ్చారేమో అనుకుని, 'వెళ్లి చూడు. మీ వాళ్లెవరో వచ్చారు' అన్నాను.

అతను వెళ్లి మాట్లాడి, మావైపు చెయ్యి చూపించాడు. వాళ్ళ పని మాతోనే అని అర్ధమైంది.

వాళ్లిద్దరూ మా దగ్గరకు వచ్చారు. నా ప్రక్కనే ఉన్న ఒక శిష్యుడు కాస్ట ఒడ్డూ పొడుగూ మంచి రంగుతో ఉన్నాడు. మంచి బట్టలలో ఉన్నాడు. అతనే ఇక్కడ గురువని వాళ్ళనుకున్నారు. నేనేమో గడ్డం మాసిపోయి, ఒంగోలు ఎండలకు నల్లబడి, నలిగి, మట్టి పోసుకున్న గుడ్డలతో, చేతిలో ఒక పారతో ఉన్నాను. నన్ను ఇక్కడ పనివాడని వాళ్ళనుకున్నారు. అందుకని, నా శిష్యుడికి నమస్కారం పెట్టి, ' అన్నదానం చేస్తున్నాం. చందా ఇవ్వండి' అడిగాడు వాళ్లలో చిన్నస్వామి.

శిష్యుడు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ నా వైపు చూశాడు.

నేను కల్పించుకునేలోపు, ఇంకొక  పాంఫ్లెట్ ఇస్తూ, 'మా గురూజీ కూడా కార్యక్రమానికి వస్తారు. అన్నదానం ఉంది. మీకు తోచినంత ఇవ్వండి' అన్నాడు పెద్దస్వామి.

శిష్యుడు మాట్లాడలేదు. మళ్ళీ నా వైపు చూశాడు.

ఆ పాంఫ్లేట్ వైపు చూశాను.

అందులో పై వరుసలో ఏసుక్రీస్తు, షిరిడీ సాయిబాబా, దుర్గామాతల బొమ్మలున్నాయి. క్రింద, 'కోయ జ్యోతిష్యం చెప్పబడును.  ఫలానా కొండరాజు గురూజీ' అని వ్రాసి ఉంది. నాకు నవ్వొచ్చింది. ఇదేంటి ఏసుక్రీస్తుని కూడా లాక్కొచ్చారే వీళ్ళు? అనుకున్నాను.

'సారీ. మేము ఇవ్వము' అన్నాను.

పనివాడి మాట పట్టించుకునేది ఏంటి? అన్నట్లుగా, 'ఎంతో కొంత ఇవ్వండి. అన్నదానానికి ఇస్తే మీకే మంచిది' అన్నాడు పెద్దస్వామి రెలిజియస్ బ్లాక్ మెయిల్ చేస్తూ.

'ఇందులో అన్నదానం ఎక్కడుంది?' అడిగాను నేను.

వాళ్ళు అయోమయంగా చూశారు.

'లేనివాడికి అన్నం పెట్టడం అన్నదానం అవుతుంది. సొసైటీలో ప్రస్తుతం లేనివాడెక్కడున్నాడు? అయినా, మీలో మీరు వంటలు చేసుకుని తింటే అది అన్నదానం ఎలా అవుతుంది? ఇలాంటి పనులకు మేము డబ్బులివ్వము.  మా ఆశ్రమానికే బోలెడంత ఖర్చు ఉంది. మాకే ఎవరైనా ఇస్తారేమో అని మేము ఎదురు చూస్తుంటే, మీకెక్కడ ఇవ్వగలం?' అన్నాను నేను మళ్ళీ.

స్వాములిద్దరూ నావైపు ఒకలా చూశారు. 'మేం మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో పనివాడివి నువ్వేంట్రా?' అని ఆ చూపు ధ్వనించింది.

మళ్ళీ అదే ధోరణిలో నా శిష్యుడితో అదే చందా రికార్డ్ వేశారు వాళ్ళు. ఏదో విధంగా ఎంతో కొంత లాగాలని వాళ్ళ ధోరణిలాగా అనిపించింది.

శిష్యుడేమో ఏం చెప్పాలో తెలీక సంకటంలో ఉన్నాడు. నా వైపు చూస్తున్నాడు.

ఇక ఇలా కాదని, 'ఈ దీక్షలపైన మాకు నమ్మకం లేదు. అయ్యప్పదీక్ష పైన అసలే లేదు' అన్నాను. 

వాళ్ళు తీవ్రంగా హర్ట్ అయ్యారు.

కోపంగా నా వైపు చూస్తూ, 'అయ్యప్ప దీక్ష అంటేనే నమ్మకం లేదా మీకు?' అన్నాడు పెద్దస్వామి. 

'లేదు' అన్నాను శాంతంగా.

నా చేతుల్లోని పాంఫ్లెట్ ను విసురుగా లాక్కొని, బైక్ ఎక్కి వెళ్లిపోయారు వాళ్ళు. 

'పోనీలే ఏమీ తిట్టలేదు. అంతవరకూ మంచివాళ్ళే ' అనుకున్నాను.

ప్రక్కకు చూస్తే, మా మేస్త్రీ గురుస్వామి నల్లగా ముఖం పెట్టుకుని ఉన్నాడు.

'ఏంటి నువ్వుకూడా హర్ట్ అయ్యావా?' అడిగాను.

'అవును సార్. అవరా మరి? చందా ఇవ్వకపోతే పోయారు. అయ్యప్ప దీక్ష మీదే నమ్మకం లేదన్నారు. దానికి బాధ కలిగింది' అన్నాడు నిష్టూరంగా.

అవును మరి. అతనే ఒక గురుస్వామి. అతని ఎదురుగా అలా అంటే, హర్ట్ అవకుండా ఎలా ఉంటాడు?

'మరి ఎంత నెమ్మదిగా చెబుతున్నా వాళ్ళు వినడం లేదు. మళ్లీ మళ్లీ అదే రికార్డ్ వేస్తున్నారు. ఇంకెలా చెప్పమంటావు? నువ్వు బాధపడకు. నాకు అయ్యప్పదీక్ష మాత్రమే కాదు, ఏ పార్టుటైం దీక్షా నచ్చదు. నీ జీవితమంతా ఒక దీక్ష కావాలి. నలభై రోజులు నిష్టగా నీతిగా ఉంటే సరిపోదు. నీ జీవితమంతా నిష్టగా నీతిగానే ఉండాలి. అదే అసలైన దీక్ష అంటే ! అలాంటి దీక్ష అయితే చెప్పు, నేను ఒప్పుకుంటాను.

నీకు ప్రస్తుతం 26 ఏళ్ళు. చిన్న పిల్లాడివి. అయ్యప్ప స్వామి ఆంధ్రాలో అడుగుపెట్టింది 1978 లో. అప్పటినుంచీ నాకు అయ్యప్పదీక్షలు తెలుసు. అంటే, నువ్వు పుట్టడానికి 20 ఏళ్ల ముందే నాకిదంతా తెలుసు. ఇదే కాదు. దీనిని మించి ఇంకా చాలా తెలుసు. నీకు ఇంతే తెలుసుగనుక ఇదే నీకు గొప్పగా అనిపిస్తుంది. నువ్వు ఒకటో తరగతిలో ఉన్నావు. నేను ఆల్రెడీ నాలుగు పీహెచ్ డీ  లు చేసి ఉన్నాను. ఆ పై తరగతులు ఏమిటో, వాటిలో ఏముంటుందో నీకు తెలియదు. అందుకే నా మాటలు నీకు బాధ కలిగిస్తాయి.

నీ దీక్ష తప్పని నేను అనడం లేదు. నీకు తెలిసింది ఇంతే. చేసుకో. కనీసం ఒక నలభై రోజులపాటు ఒక పద్ధతిగా ఉండటం నీకు అలవాటవుతుంది. మంచిదే. కానీ దీనిని మించినది ఇంకా చాలా ఉంది. అది నేర్చుకోవాలనుకుంటే, ఆశ్రమం ఓపెన్ అయ్యాక రోజూ వచ్చి ఇక్కడ కూర్చుని నేర్చుకో. నేర్పిస్తాను.  అప్పుడు నేనన్న మాటలోని నిజం నీకు అర్ధమౌతుంది' అన్నాను శాంతంగా.

మా మేస్త్రీకి నా మాటలు  నచ్చలేదని అతని ముఖమే చెబుతోంది. ఏమనుకున్నాడో ఏమో అక్కడనుంచి మెల్లిగా నిష్క్రమించాడు.

షామియానాలు వేసి, భోజనాలు వండి, సౌండ్ పొల్యూషన్ తో పెద్దగా మైకులు పెట్టి, భజనలంటూ గోలగా అరుస్తూ, డబ్బున్నవాళ్లంతా కూచుని భోజనాలు చేస్తే అది 'అన్నదానం' అవుతుందా? ఎలా అవుతుందో నాకైతే అర్ధం కాదు.

పోనీ అన్నదానమే అనుకుందాం. ఒక్క కార్తీకమాసంలో చేస్తే సరిపోతుందా? మిగతా మాసాలలో పేదల ఆకలి ఎవరు తీరుస్తారు? అయినా ఇప్పుడు పేదవాడు ఎవడున్నాడు? ప్రభుత్వమే ఇంటింటికీ డబ్బులు పంచుతోంది. పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు మినిమం కోటి ఆస్తి లేనివాడు  ఎవడూ లేడు. ప్రస్తుతం పేదవాళ్లం మనమే.

అసలు అన్నదానమే చెయ్యాలనుకుంటే దానికి మతంతో దీక్షలతో పనేముంది? దానికి చందాలెందుకు? అడుక్కుని అన్నదానమేంటి అసలు? డొక్కా సీతమ్మగారిని ఆదర్శంగా తీసుకుని, నీ నిజాయితీ సంపాదనతో నువ్వు అన్నదానం చెయ్యాలి గాని?

ఆకలితో ఉన్నవాడి ఆకలి తీర్చడమే నీ ఆశయమైతే దానికి మతపు రంగెందుకు? చందాలెందుకు? ఈ పోజులెందుకు? అసలు ఆకలితో ఉన్నవాడు ఏడి? నేటి సమాజంలో ఉన్న అతి పెద్ద సమస్య ఒబేసిటీ మాత్రమే, ఆకలి కాదు.

ఆశ్రమం బోర్డు చూసి, ఎవడైనా బకరా దొరుకుతాడనుకుని వచ్చినట్లున్నారు.  రెలిజియస్ బ్లాక్ మెయిల్ మనదగ్గర ఎలా పనిచేస్తుంది?

పిచ్చి జనం ! పిచ్చి గోల ! ప్రతిదాన్నీ డబ్బు సంపాదించే ఒక మార్గంగా మలుస్తారు. వాళ్ళ దృష్టి అంతవరకే. లోకంలో మెజారిటీ ప్రజలు సత్యమైన ఆధ్యాత్మికమార్గంలో  ఎప్పటికీ నడవలేరు. డొల్లతంతులలో కాలక్షేపం చేస్తూ, అదే ఏదో గొప్పగా భావిస్తూ పొంగిపోతూ ఉంటారు.

ఈ లోకం తీరు ఇంతే.