Pages - Menu

Pages

2, డిసెంబర్ 2023, శనివారం

మీకు నాగబంధం వచ్చా?

'విజ్ఞాన భైరవ తంత్రం', 'మాలినీ విజయోత్తర తంత్రం', 'తంత్రసారం' మొదలైన గ్రంధాలను వ్రాసినందుకేమో నన్ను ఒక మాంత్రికుడినని చాలామంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా  ఆధ్యాత్మికత లోతుపాతులు తెలియనివారు అలా అనుకోవడం సహజం కూడా. ఇక పల్లెటూరి మొద్దులు అలా అనుకోవడం ఆశ్చర్యమేముంటుంది?

నిన్న సాయంత్రం ఒక ఫోనొచ్చింది.

'నాగబంధం, శూలాలు గురించి పుస్తకాలు మీ దగ్గరున్నయ్యా? మేము గుంటూరుకు వచ్చి తీసుకోవచ్చా?' అని డైరెక్ట్ గా ఒకాయన అడిగాడు.

'మీకు నా నంబర్ ఎలా దొరికింది?' అని అడగడం ఈ మధ్యన మానేశాను. పాత పుస్తకాలలో ఉంటుంది కదా !

భాషను, యాసను బట్టి మాట్లాడుతున్నది పక్కా పల్లెటూరి మనిషని అర్ధమైంది.

'మేము గుంటూరు వదిలేశాము. ప్రస్తుతం ఒంగోలు దగ్గర ఆశ్రమంలో ఉంటున్నాం' అన్నాను.

'మాది అద్దంకి గ్రామం. మాకు దగ్గర్లోనే మీరున్నారు' అన్నాడు

'అవును' అన్నాను.

'అమ్మ చెబుతోంది. వేరే వాళ్ళది ఉంది. వచ్చి తీసుకో' అంటోంది' అన్నాడు.

'ఎవరా అమ్మ?' అడిగాను.

'పోలేరమ్మ' అన్నాడు.

'ఏం తీసుకోమంటోంది?' అడిగాను.

'అదే. పెద్దోళ్ళు భూమిలో దాచిపెట్టినవి ఉంటాయి కదా. అవి' అన్నాడు.

'అంటే నిధులా?' అన్నాను.

'ఆ. అవే ! నాకు వెండి వస్తువులు దొరుకుతూ ఉంటాయి. అంతవరకే. పెద్దవాటిని నేను తియ్యలేను. మీరొస్తానంటే చోటు చూపిస్తాను. అయితే నాగబంధం వెయ్యాలి. అందుకే మీకు తెలుసేమో అని ఫోను చేస్తున్నాను. నిధిలో మీ పావలా మీరు తీసుకోండి. మిగతాది మాకు' అన్నాడు.

'ఇతరుల సొమ్మును అలా తీసుకోకూడదు. మనం కష్టపడినదే మనకు మిగులుతుంది. ముందు ఇది అర్ధం చేసుకోండి. పోలేరమ్మ మాట వినకండి' అన్నాను.

'అమ్మ మాట వినొద్దా? బలే చెబుతున్నావే? కష్టపడితేనే కదా నిధి దొరికేది' అన్నాడు పల్లెటూరి వితండవాదంతో.

'తేరగా అలా దొరికే సొమ్ము మంచిది కాదు. అది దొంగతనంతో సమానం. నేనిలాంటి పనులు చెయ్యను. ఆ చెప్పేది పోలేరమ్మ కాదు. నీ మనసులో ఉన్న దురాశ' అన్నాను.

'మీకు నాగబంధం వచ్చా రాదా చెప్పండి' అన్నాడు సూటిగా.

'వచ్చు. మూలబంధం, మహాబంధం కూడా వచ్చు. కానీ ఇలాంటి పనులకు వాడను. మీకూ ఇటువంటి పనులు మంచివి కావు.  చెయ్యొద్దు. కుటుంబాలు నాశనమౌతాయి' అన్నాను.

'సారీ సార్. మాకు నీతులు అక్కర్లేదు. పని జరగడం కావాలి. సారీ. మీకు ఫోన్ చేసి విసిగించాం' అన్నాడు.

ఫోన్ కట్ అయ్యింది.

అద్దంకి ప్రాంతం కూడా ఒకవిధంగా వెనుకబడిన ప్రాంతమే. అందుకే ఇక్కడ ఇలాంటి మంత్రతంత్రాలు  మొదలైనవి ఎక్కువ. ఇటు నెల్లూరు, తమిళనాడు బార్డర్ లోను, అటు విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం ప్రాంతాలలోను, కడప జిల్లా లోను ఇలాంటి మాయమంత్రగాళ్ళు ఎక్కువగా తగులుతూ ఉంటారు.

ఈ ఫోన్ చూస్తే,  కొన్నేళ్ల  క్రితం నల్లమల అడవులలో నిధికోసం రమ్మని ఒక మాఫియా ముఠా చేసిన ఫోన్ గుర్తొచ్చింది. తంత్రమంటే వీళ్లకు అర్ధమైంది ఇదా?

లోకులు ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నారో మరొక్కసారి అర్ధమైంది.

దురాశ అనే అగ్నిగుండంలో కోట్లాది జీవులు కాలిపోతున్నాయి. కానీ కాలుతున్నామనే స్పృహ కూడా వాటికి లేదు. ఎంత మాయ !

నాగుపామును మంత్రంతో కట్టేసే నాగబంధం కంటే, మనుషులను ప్రేమతో కట్టేసే ఆత్మబంధం మంచిది కదూ ! తేరగా వచ్చి, కొన్నాళ్ళకు కరిగిపోయే ఇతరుల సొమ్ము కంటే, సాధనతో వచ్చి ఎప్పటికీ నిలిచి ఉండే ఆత్మసిద్ధి ఉత్తమం కదూ !

ఒకళ్ళ సొమ్ము తేరగా వస్తే బాగానే ఉంటుంది. తరువాత నానా రకాల జన్మలెత్తి ఆ ఋణాలు తీర్చుకునేటప్పుడు నరకం  అంటే ఏమిటో అర్ధమౌతుంది.

తాత్కాలికంగా వచ్చే లాభాల కంటే, శాశ్వతంగా నిలిచి ఉండే ఆనందాలు ఎంత విలువైనవి !

ఎప్పుడు అర్ధమౌతుందో ఈ గొర్రెలకు?