Pages - Menu

Pages

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

R.I.P Pankaj Udhas




నిన్న పంకజ్ ఉదాస్ చనిపోయాడు. ఈయన 72 ఏళ్ళు బ్రతికాడు. కొద్ది నెలలుగా పాంక్రియాస్ కేన్సర్ తో బాధపడుతున్నాడు.

ఘజల్స్ పాడటంలో ఈయనదొక ప్రత్యేకశైలి.  ఈయన తండ్రిగారు, ఇద్దరు అన్నలు ఆందరూ గాయకులే. వీరిది గుజరాత్ లోని రాజకోట్ దగ్గరలో ఒక జమీందారీ కుటుంబం. ఫరీదా అనే పార్శీ వనితను ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

ఈయన మే 17, 1954 న గుజరాత్ లో పుట్టాడు. ఈయన జనన, మరణ జాతకాలను ప్రక్కన చూడవచ్చు. 

ఈయన గాయకుడే  గాక, తబలా, వయోలిన్, పియానో, గిటార్ లను వాయించడంలో ప్రావీణ్యం ఉన్న బహుముఖ కళాకారుడు.

ఈయన పౌర్ణమినాడు పుట్టాడు. రాహుకేతువులు నీచ స్థితులలో ఉన్నారు. వేరే కులం, వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వివాహజీవితం బాగానే నడిచింది.

ఈ రెండు చార్ట్ ల పరిశీలన కొన్ని జ్యోతిష్య రహస్యాలను తెలియజేస్తుంది.

ఈయన వివాహజీవితం, కెరీర్, చివరకు పాంక్రియాస్ కేన్సర్ ఇవన్నీ ఈ చార్ట్ లు  స్పష్టంగా చూపిస్తున్నాయి.

21, ఫిబ్రవరి 2024, బుధవారం

మీ దగ్గర చేతబడి ఉందా?

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగిసింది.  అన్ని స్టాల్స్ లాగే మా స్టాల్ కూడా మూసేసి ఇంటిదారి పట్టాము.

'ఎలా ఉంది ఈ పదిరోజుల అనుభవం?' మూర్తిని ఫోన్ లో అడిగాను

'చాలా దారుణంగా ఉంది. ఒక పక్కన ఎండలు, మరోప్రక్కన జనాల విచిత్ర మనస్తత్వాలు, మైండు బ్లాంక్ అయిపొయింది' అన్నాడు.

ఈసారి కూడా మాకు పడమర వైపు స్టాలే వచ్చింది. మధ్యాహ్నం నుండి అందరికీ ఎండ పేలగొట్టింది.

'ఏమైంది? వింతమనుషులందరూ కనిపించారా?' అడిగాను.

'అవును. చాలామంది మాకు బోధలు చెయ్యడానికే స్టాల్ దగ్గరకు వచ్చినట్లుగా ఉన్నారు' అన్నాడు.

'ఇప్పుడు అందరూ యూట్యూబ్ యూనివర్సిటీ పీ హెచ్ డీ లే. అందులో చూడటం, ఇక కనిపించిన వారికందరికీ బోధలు చెయ్యడం. ఇదే ప్రస్తుతం నడుస్తున్నది' అన్నాను.

'కొందరైతే, 'ఈయనొక క్రొత్త గురువా? ఇప్పటికి ఉన్నవాళ్లు చాలరా? ఈయనను మేమెందుకు నమ్మాలి? రామాయణం భారతాలలో లేనిది క్రొత్తదేమైనా ఈయన చెబుతున్నాడా? అవి చాలవా? కొత్తకొత్తవి ఎందుకు?' అన్నారు.

'రామాయణ భారతాలకంటే ముందు వేదాలున్నాయి. మరి వేదాలలోనే అంతా ఉంది కదా? ఇవెందుకు?' అని నువ్వు అడిగి ఉండాల్సింది' అన్నాను.

మరి కొంతమంది, 'బుద్ధుడు మాకు నచ్చడు' అంటూ ధమ్మపదం పుస్తకాన్ని అటూ ఇటూ తిప్పి అవతలపడేశారు' అన్నాడు.

'అవును. సాంప్రదాయ చాదస్తపు హిందువులకు బుద్ధుడు నచ్చడు. మనకు నచ్చుతాడు. మనకే కాదు, బుద్ధుని తత్త్వాన్ని అర్ధం చేసుకుంటే ఎవరికైనా నచ్చుతాడు' అన్నాను.

ఇంకొకాయనైతే మీ ఫోటోను చూస్తూ, ' నేనుకూడా ఇలా ఒక గ్రూపు మెయింటెయిన్ చేద్దామని చాలాకాలం నుండి అనుకుంటున్నాను. కుదరడం లేదు. ఈ లోపల ఎవరు పడితే వాళ్ళు ఆశ్రమాలు పెట్టేస్తున్నారు' అంటూ తెగ ఫీలై పోయాడు. తన జెలసీని కనీసం లోపల దాచుకోవడం కూడా అతనికి కుదరడం లేదు' అన్నాడు మూర్తి.

'పాపం ! అంత కుతకుత ఉందన్నమాట లోపల. కూల్ డ్రింక్ ఒకటి ఆఫర్ చెయ్యకపోయావా. కొంచెం చల్లబడేవాడు' అన్నాను.

'ఒకామె అయితే, 'నేను గురువుల దగ్గరకు వెళ్ళను. వాళ్లే నన్ను వెతుక్కుంటూ రావాలి' అంది మన స్టాల్ దగ్గర కొచ్చి.' అన్నాడు మూర్తి.

'చాలా కరెక్ట్ గా చెప్పింది. ఎవడికి అవసరమైన దానిని వాడు వెతుక్కుంటాడు, తప్పేముంది?' అన్నాను.

'ఇంకొకడైతే రావడం రావడం 'చేతబడి ఉందా?' అని అడిగాడు. కనీసం 'చేతబడి మీద బుక్స్ ఉన్నాయా' అని కూడా అడగలేదు. 'చేతబడి ఉందా' అంట, ఐస్ క్రీమ్ ఉందా అన్నట్టు' అన్నాడు మూర్తి.

'లోపలుంది పిలుస్తా ఉండండి' అని మన రమేష్ ని పిలిచి ఉండాల్సింది. వాడికి స్పాట్లో చేతబడి చేసి ఉండేవాడు' అన్నాను.

'మరీ ఇంత దరిద్రంగా ఉన్నారేంటి మనుషులు?' మూర్తికి అనుమానం వచ్చింది.

'అంతే. 'పాపట్లో నెరిసిన తర్వాత పాప పతివ్రత అయింది' అని సామెతుంది. అలాగే, అన్ని రకాలుగా భ్రష్టు పట్టిన తర్వాతే ఆధ్యాత్మికంలోకి వస్తారు. అదంతే' అన్నాను.

' అసలైన తత్త్వం ఎవరూ అడగడం లేదు. ఎవరిని చూసినా, పూజలు, మంత్రాలు, కుండలిని, తంత్రం, రెమెడీలు, క్షుద్రవిద్యలు, ఇదే గోల ! ఇదేం ఖర్మ గురూజీ. లోకం ఇలా తయారైంది?' అన్నాడు 

' ఇలాగే ఉంటుంది. అసలు విషయం చెప్తా విను. ఆధ్యాత్మికులమని చెప్పుకునేవారిలో 50 శాతం మంది నిజానికి మెంటల్ పేషంట్లు, వారికి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్లకు ట్రీట్మెంట్ అవసరం. మరొక 45 శాతం మంది విజ్ఞానప్రదర్శకులు, మోసగాళ్లు. ఆ 50 మందిని ఈ 45 మంది మోసం చేస్తుంటారు. ఎక్కడో విని, లేదా చదివి, వీరికి చెబుతుంటారు. అనుభవం ఉండదు. వారికి ఆసరా కావాలి. వీరికి గొప్పలు కావాలి.  మిగతా ఒక్క అయిదు శాతం మాత్రమే నిజమైన జిజ్ఞాసువులు, సాధకులు ఉంటారు. ఎక్కడైనా ఇంతే' అన్నాను.

'ఆ అయిదు శాతం ఎక్కడుంటారు?' అడిగాడు.

'మన పంచవటిలో ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, బయట అంతా నకిలీనే. కాకపోతే ఆ 95 శాతం కూడా 'మేమే అసలైన వాళ్ళం ' అని చెబుతారు. అసలైన అయిదు శాతాన్ని నకిలీ అంటారు. అదే కలిమాయ' అన్నాను.

'అర్ధమైంది గురూజీ, మరి ఇదంతా తెలిసికూడా మాచేత స్టాల్ ఎందుకు పెట్టించారు?' అడిగాడు.

'జస్ట్ ఫర్ ఫన్. మెంటల్ పేషంట్లలో ఎన్ని రకాలుంటారో మీకు ప్రాక్టికల్ గా అర్ధం కావడం కోసం పెట్టించాను. ఈ పదిరోజులలో బాగా అర్థమైందా?' అడిగాను.

'అయింది, ఇప్పుడు మమ్మల్నేం చెయ్యమంటారు?'

'ఏమీ చెయ్యద్దు. జస్ట్ ఎంజాయ్ లైఫ్. కొన్నాళ్లపాటు హాయిగా వేళకు తిని, నిద్రపొండి. మళ్ళీ వచ్చే నెలలో మన స్పిరిట్యువల్ రిట్రీట్ ఉంది. దానికి రెడీ అవ్వండి' అని ఫోన్ కట్ చేశాను.

19, ఫిబ్రవరి 2024, సోమవారం

అబూదాబీలో అతిపెద్ద హిందూమందిరం - జయహో మోడీ జీ !

స్వామి నారాయణ్ సంస్థచేత నిర్మించబడిన అతిపెద్ద  హిందూమందిరం అబూధాబిలో ఈ నెల 14 న ప్రారంభం అయింది. ఇది మోడీజీ ప్రభుత్వపు ఘనవిజయాలలో మరొకటి

దీనిపేరు BAPS Hindu Mandir.

మోడీజీ ప్రభుత్వపగ్గాలు చేపట్టిన ఇన్నేళ్ళలో మన దేశచరిత్రను తిరగవ్రాస్తూ సాధించిన ఘనవిజయాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటినీ వ్రాస్తూ పోతే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. గత 75 ఏళ్లుగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు చేసిన దుర్మార్గాలను, అరాచకాలను, దేశద్రోహాలను సరిద్దుతూ ఈ విజయాలు సాగుతూ వస్తున్నాయి. 

అలాంటిదే ఈ విజయం కూడా !

ఒక అరబ్ దేశంలో హిందూదేవతలు అనేకమంది పూజింపబడే ఒక  అతి పెద్ద దేవాలయం కట్టబడటం ఊహకే సాధ్యం కాని పని. కానీ సాధ్యం అయింది.

గత వెయ్యేళ్ళుగా మన దేశంలోని వేలాది చిన్నా పెద్దా దేవాలయాలను తుర్కులు, అరబ్బులు, మొఘలులు, కూలగొట్టారు. మన గ్రంధాలను వేలాదిగా తగులబెట్టారు. లక్షలాదిమంది హిందువులను, ముఖ్యంగా బ్రాహ్మణులను, గురువులను చంపేశారు. చరిత్రలో వీటికి సాక్ష్యాలున్నాయి.

అటువంటిది చరిత్రలో మొదటిసారిగా ఒక అరబ్ దేశంలో హిందూదేవాలయం కట్టబడింది. ఇది కుహనా ముస్లిములకు, ముఖ్యంగా ఇండియా, బాంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లిములలో చాలామందికి, ముఖ్యంగా జాకీర్ నాయక్ బ్యాచ్ కి అస్సలు మింగుడుపడదు. కానీ UAE ఒప్పుకుంది. వారి దేశంలో ఒక హిందూదేవాలయాన్ని ఆహ్వానించింది. అరబ్బులందరూ దుర్మార్గులు కిరాతకులు కారని ఈ విషయం రుజువు చేస్తున్నది. 

నిజానికి మతపిచ్చి, తీవ్రవాద క్రిమినల్ ధోరణులు అందరు ముస్లిమ్స్ లో ఉండవు.  ముల్లాలు, మౌల్వీలు, కాంగ్రెస్ పార్టీ సహాయంతో, ఇంకా కొన్ని ప్రాంతీయపార్టీల సహాయంతో ముస్లిములను రెచ్చగొడుతుంటారు. అంతేగాని ముస్లిములందరూ దుర్మార్గులు కారు. నా స్నేహితులలో ఎంతోమంది మంచి ముస్లిములున్నారు. వాళ్ళూ కొన్ని తరాల క్రితం హిందువులేగా. పేర్లు మార్చుకున్నా, DNA మారదుగా.

ఈ బృహత్తర ఆలయం గురించి కొన్ని వివరాలను చూద్దాం.

  • ఈ ఆలయం కట్టడానికి ప్రాసెస్ 1997 లో మొదలైంది.
  • 2019 లో 27 ఎకరాలను ఈ ఆలయనిర్మాణం కోసం ఇస్తూ UAE యువరాజైన షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యా ఒక ఆర్డర్ ఇచ్చాడు.
  • ఈ ఆలయనిర్మాణానికి కావలసిన గులాబీరంగు ఇసుకరాయిని రాజస్థాన్ నుంచి, మార్బుల్ ను ఇటలీ నుంచి తెచ్చారు.
  • బ్రిటన్, అమెరికా, ఇండియా, ఆఫ్రికా, గల్ఫ్, UAE ల నుండి 200 మంది వాలంటీర్లు ఈ నిర్మాణంలో పనిచేశారు.
  • ఈ ఆలయంలో 402 స్తంభాలున్నాయి. 
  • నగిషీలు చెక్కిన రాతిపలకలు 25,000 పైనే ఉన్నాయి.
  • ఈ ఆలయం ప్లాన్ వేసింది ఒక కాథలిక్ క్రిస్టియన్.
  • నిర్మాణ పర్యవేక్షణ చేసినది ఒక పార్సీ సంస్థ.
  • మే 2023 లో 30 దేశాల రాయబారులు ఈ ఆలయాన్ని దర్శించారు.
  • జనవరి 2024 లో 42 దేశాల ప్రతినిధులు ఈ ఆలయాన్ని దర్శించారు.
  • ఫిబ్రవరి 14, 2024 న ఒక వైదిక హోమం తో ఈ ఆలయం ప్రారంభమైంది.
  • నిన్నటినుంచి పబ్లిక్ కోసం తెరవబడింది.

వెయ్యి ఏళ్లుగా, మిడిల్ ఈస్ట్ దేశాల చేతిలో తన్నుడు, చంపుడు, విధ్వంసం, ఇవి మాత్రమే మనం చవిచూచాం. కానీ నేడు UAE లో మనదైన అతిపెద్ద దేవాలయాన్ని కట్టగలిగాం.

ఇది చరిత్రను తిరగవ్రాయడం కాదా ?

దేశద్రోహపార్టీలు ఏవైనా ఈ పనిని చేయగలిగాయా? అవి జాతీయ పార్టీలైనా సరే, ప్రాంతీయ పార్టీలైనా సరే.

ఇది మోదీజీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాలలో మరొకటి.

ఇప్పుడు చెప్పండి. వచ్చే ఎన్నికలలో మనం ఎవరిని ఎన్నుకోవాలి?

మన దేశప్రతిష్ఠను హిమాలయశిఖరాలపైన నిలబెట్టిన బీజేపీ నా?

దేశాన్ని ముక్కలు చేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్న ఇతర పార్టీలనా?

ఆలోచించండి.

15, ఫిబ్రవరి 2024, గురువారం

దొంగ మొగుడు - దొంగ పెళ్ళాం

'బుక్ ఫెయిర్ లో శివరాం సార్ కనిపించాడు' అన్నాడు రవి పొద్దున్నే ఫోన్ చేసి. గొంతు చూస్తే బాగా ఉద్వేగంతో ఉన్నాడు.

రవి ఈ మధ్యన ఫోన్ చెయ్యడం తగ్గించాడు. దానికొక కారణముంది.

ఇంతకు ముందు ఇద్దరం సర్వీసులో ఉండేవాళ్ళం గనుక, పొద్దున్నే వాకింగ్ సమయంలో మాట్లాడేవాడు. నేనుకూడా ఏదో ఒక పని చేసుకుంటూ తనతో మాట్లాడేవాడిని. ఇప్పుడేమో తను కూడా రిటైరయ్యాడు. కానీ వాకింగ్ మానలేదు. మనకేమో వాకింగ్ అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. కానీ ప్రస్తుతం ఆశ్రమవాసినయ్యాను గనుక, మన టైం టేబుల్ వేరుగా ఉంటుంది,

ఉదయం మూడు నుంచి తొమ్మిదివరకూ జపమో, తపమో, మంత్రమో, తంత్రమో, యోగమో, వియోగమో ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఫోన్ కాల్స్ మాటలాడటం కష్టం. అయినా సరే, ముప్పై ఏళ్ల  స్నేహం కదా అని అప్పుడప్పుడూ మాత్రం ఫోనెత్తుతూ ఉంటాను.

అప్పుడు ఇలాంటి షాకింగ్ న్యూసులు చెబుతూ ఉంటాడు.

ఒక రకంగా చెప్పాలంటే, బయటి ప్రపంచంతో నాకున్న కొన్ని సంబంధాలలో రవి ఒకడు. లేకపోతే, ప్రపంచంలో ఏం జరుగుతోందో మనకు తెలీదు, 

మనకు అనవసరం కూడా.

'ఎవరా శివరాం ఏమా కథ' అన్నాను కూల్ గా.

'శివరాం కాదు శివరాం సార్ అనాలి' అన్నాడు ఏదో నేరం జరిగిపోయినట్టు బాధపడుతూ.

'ప్రతివాడినీ సార్ అనాల్సిన ఖర్మ నాకేంటి? విషయం చెప్పు' అన్నాను.

'శివరాం సార్ బుక్ ఫెయిర్ కొచ్చి, ఆధ్యాత్మిక పుస్తకాలు బోలెడన్ని కొనుక్కుని ఒక బండిల్ గా చేసి కారులో పెట్టుకుని తీసికెళ్ళాడు. నేనే కళ్లారా చూశాను' అన్నాడు.

'ఇందులో వింతేముంది? ఎంతోమంది సాహిత్యాభిమానులు అలా చేస్తూ ఉంటారు, బుక్ ఫెయిర్ పెట్టిందే బుక్స్ కొనుక్కోడానికి' అన్నాను.

'అది కాదు. అందరూ రావడం వేరు. సార్ రావడం వేరు' అన్నాడు రవి.

'ఏం? అందరూ నేలపైన నడిస్తే ఈయన గాలిలో ఎగురుకుంటూ వస్తాడా?' అడిగాను.

'అదికాదు. ఈయన అవతారం కదా? ఈయన బుక్ ఫెయిర్ కి రావడం ఏంటి?' అన్నాడు ఏడుపు గొంతుతో.

నవ్వీ నవ్వీ పొట్ట చేత్తో పట్టుకున్నాను.

'అవతారమా? ఎవరి అవతారం?' అన్నాను నవ్వాపుకుంటూ.

'వెంకటేశ్వరస్వామి అవతారం' అన్నాడు కూల్ గా.

'ఏంటి పొద్దున్నే పిచ్చెక్కిందా? శివరాం సార్, వేంకటేశ్వరస్వామి అవతారమా? సరే అయితే అయ్యాడు. నువ్వెందుకు దానికి బాధపడటం?' అన్నాను నవ్వుతూ.

'అవును. అలా అని పెద్ద ప్రచారం జరుగుతోంది. ఆయనకు చాలామంది భక్తులు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ ఇదంతా నిజమని నేనుకూడా నమ్మాను. ఇప్పుడు చాలా సిగ్గుగా ఉంది' అన్నాడు.

'ఒకవేళ అవతారమే అయితే, తిరుమల కొండమీదకి పోయి కూచోమను.  మనకెందుకు?' అన్నాను.

'అదికాదు. నా డౌటేంటంటే, ఆయన వెంకటేశ్వరస్వామి అవతారమే అయితే, బుక్ ఫెయిర్ లో అన్ని స్టాల్సూ తిరిగి ఆధ్యాత్మిక పుస్తకాలు కొనడం ఏమిటి? ఇదే నాకర్ధం కావడం లేదు' అన్నాడు రవి.

'ఇందులో అర్ధం కావడానికేముంది? వెరీ సింపుల్. స్వామికి కొండమీద బోరు కొట్టింది. హైద్రాబాద్ బుక్ ఫెయిర్ కొచ్చి బుక్స్ కొనుక్కుంటున్నాడు. అంతే' అన్నాను.

'జోకులాపు. నాకేమనిపిస్తోందో చెప్పనా? ఈయన అవతారం అనేది కొంతమంది మోసగాళ్ల ప్రచారం మాత్రమే.  అది నిజం కాదు. అది కేవలం బిజినెస్ ప్రొమోషన్, అంతే' అన్నాడు.

'ఈ విషయం నీకెప్పుడో చెప్పాను. నువ్వే మర్చిపోయి, ఇవాళ మళ్ళీ నాకే తిరిగి చెబుతున్నావు, రిటైరైన తర్వాత నీ  మైండు మైదాపిండి అయిపోయింది, అందుకే ఆశ్రమానికొచ్చి నా దగ్గర ఒక నెలరోజులుండు. మళ్ళీ యంగ్ గా తయారౌతావ్' అన్నాను కోపంగా.

'అన్నీ తెలిసినవాడు నీలాగా పుస్తకాలు వ్రాయాలి గాని, పుస్తకాలు కొనుక్కు పోవడమేంటి? అంటే, ఆ పుస్తకాలన్నీ చదివి, అందులో విషయాలకు కొంత మసాలా కలిపి తన సోకాల్డ్ భక్తులకు చెబుతున్నాడన్నమాట శివరాం సార్?' అన్నాడు రవి.

'ఎవడైనా చేస్తున్నది అదే. చాలామంది మన స్టాల్లో పుస్తకాలు కొనేవాళ్ళు కూడా అదే చేస్తున్నారు. కొంతమంది ఓపెన్ గా మనకావిషయాన్ని చెప్పారు కూడా. అంతెందుకు? గత పదేళ్లుగా మన బ్లాగు నుంచి ఎంత మెటీరియల్ సినిమాలకు, యూట్యూబు వీడియోలకు ఉపయోగపడిందో తెలుసా నీకు?' అడిగాను.

'మరి ఇలాంటి మోసగాళ్ల వలలో పడి ఎంతమంది బకరాలైపోతున్నారో తలుచుకుంటేనే బాధగా ఉంది' అన్నాడు దాదాపు ఏడుపుగొంతుతో.

'మరీ అంత బాధపడకు. వినేవాళ్ళు నిజమనుకుంటారు' అన్నాను.

'అదికాదు. ఈ సమస్యకు పరిష్కారం కావాలి. లేకపోతే నాకు నిద్రపట్టదు. నా సంగతి నీకు తెలుసు కదా?' అన్నాడు.

రవికి ఓవర్ యాంగ్జైటీ బాగా ఎక్కువ. దేనినీ తట్టుకోలేడు. ఒప్పుకోలేడు. తన సంగతి నాకు బాగా తెలుసు. 

'సరే. ఈ సమస్య పరిష్కారానికి నేనొక సలహా చెప్పనా?' అన్నాను.

'చెప్పు'.

'విను. మొగుడి సంగతి పెళ్ళానికి తెలిసినట్లు ఎవరికీ తెలీదు. అవునా?' అన్నాను.

'అవును' ఒప్పుకున్నాడు.

'అలిమేలుమంగమ్మ అవతారాన్నని చెప్పుకుంటూ చాలాకాలంగా ఒక అమ్మ జనానికి బాగా టోపీ వేస్తున్నది. ఆమె ఎవరో నీకూ తెలుసు నాకూ తెలుసు. ఆమెనడిగితే సరి. శివరాం సార్ వెంకటేశ్వరస్వామా? కాదా? తేలికగా చెప్పేస్తుంది. తన మొగుడి సంగతి తనకు తెలుస్తుంది కదా? ఇంతకంటే యాసిడ్ టెస్ట్ ఇంకేముంటుంది?' అన్నాను.

'భలే ఐడియా ! నేను రేపే మంగమ్మమాత దగ్గరికి వెళ్లి ఈ విషయం అడిగేస్తాను. ఆమె శిష్యుడు ఒకాయన నాకు బాగా పరిచయమే' అన్నాడు రవి.

'ఇప్పుడు నాదొక సందేహం?' అన్నాను.

'నీకు సందేహమా? చెప్పు వింటాను' అన్నాడు రవి.

'ఒకవేళ శివరాం సార్ వెంకటేశ్వరస్వామే అని మంగమ్మమాత చెప్పిందనుకో, అప్పుడు మంగమ్మమాతకే ప్రాబ్లమ్ అవుతుంది. వీళ్ళిద్దరూ విడివిడిగా ఎందుకుంటున్నారు? ఉండకూడదు కదా? కాబట్టి ఇద్దరూ అర్జెంటుగా మేరేజి చేసుకోవాలి. కొండపైన సహజీవనం స్టార్ట్ చేయాలి. అలా కాకుండా,  'ఈయన అవతారం కాదు' అని మంగమ్మ మాత చెప్పిందనుకో, అప్పుడు ఈయనకు ప్రాబ్లమ్ వస్తుంది. ఈయన తన షాపు మూసుకోవాల్సి వస్తుంది' అన్నాను.

'ఇప్పుడు నాదొక డౌటు' అన్నాడు.

తను కూడా నాలాగే లా గ్రాడ్యుయేటే. మా బుర్రలన్నీ ఒకే విధంగా ఆలోచిస్తాయి మరి.

'ఏంటది చెప్పు' అడిగా టీ సిప్ చేస్తూ.

'ఏం లేదు? అసలు మంగమ్మమాత అలిమేలుమంగే అని గ్యారంటీ ఏముంది? ఆమె ఇచ్చిన సర్టిఫికెట్ ను మనం వాలిడ్ గా ఎలా తీసుకోగలం? ఆమెనే నకిలీ కావచ్చు కదా?' అన్నాడు రవి. 

'వెరీ గుడ్ పాయింట్. ఆమె అవతారమా కాదా అని శివరాం సార్ నే అడుగుదాం. పెళ్ళాం సంగతి మొగుడికి తెలీదా?' అన్నాను.

'ఇద్దరూ జినైన్ అయితే నువ్వు చెప్పేది ఓకే, కానీ ఇద్దరూ ఫేక్ అయినపుడు ఎలా? ఎవరి మాటను నమ్మాలి?' అడిగాడు.

'అప్పుడు ఇద్దరి మాటనూ నమ్ముదాం. ఇద్దరికీ దగ్గరుండి మేరేజి చేయించి తిరుమల కొండమీదకు తీసికెళ్ళి అక్కడ అడివిలో వదిలేద్దాం. అదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం' అన్నాను.

పెద్దగా నవ్వాడు రవి.

'ఎక్కడ వదిలేద్దాం? మొన్నా మధ్య ఒక చిన్నపిల్లను పులి ఎత్తుకుపోయింది చూడు. ఆ ప్రాంతంలో వదిలేద్దామా? ఒక ఏడాదిపాటు ఏ పులీ ఇక భక్తుల జోలికి రాకుండా ఉంటుంది' అన్నాడు.

'అంతే, వెరీ గుడ్ ఐడియా. నువ్వు రేపే శివరాం సార్ ని కలువు. ఆ తర్వాత మంగమ్మమాత దగ్గరికి వెళ్లి ఆ పనిమీదుండు' అన్నాను.

'థాంక్స్ రా. మంచి ఐడియా ఇచ్చావ్. రిటైరయ్యాక పనీ పాటా లేకుండా పోయింది. ఈ పనిమీదుంటాను' అని ఫోన్ పెట్టేశాడు.

నేను ఎదురుగా ఉన్న వెంకటేశ్వరస్వామి ఫోటోకి భక్తిగా నమస్కరించుకుని, 'స్వామీ ఏమి నీ లీల?' అనుకున్నాను.

'నా లీల కాదు నాయనా. ఇదంతా మీ గోల' అంటూ స్వామి స్వరం నా చెవులలో ప్రతిధ్వనించింది.

9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ ప్రారంభం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ (నం. 67) ప్రారంభం అయింది.

సందర్శించండి



8, ఫిబ్రవరి 2024, గురువారం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్ ను సందర్శించండి



హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ - 2024, ఈ నెల 9 నుంచి 19 వరకూ జరుగుతున్నది. దానిలో పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ కు స్టాల్ నంబర్ 67 కేటాయించబడింది. ఈ రోజు స్టాల్ ను సెటప్  చేయడం జరిగింది. పుస్తకాలు రేపటినుండి పెట్టబడతాయి. మా పుస్తకాలు కావలసినవారు ఈ స్టాల్ ను సందర్శించండి.

అక్కడ పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీరామమూర్తిని, ఇతర సభ్యులను మీరు కలుసుకోవచ్చు. సనాతన ధర్మం పైన, ఆధ్యాత్మిక ప్రయాణం పైన, మా సాధనా మార్గం పైన, మీమీ సందేహాలను వారితో మాట్లాడి తీర్చుకోవచ్చు. పంచవటిలో సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. మాతో కలసి ప్రయాణం చేయవచ్చు.

హైదరాబాద్ లో ఉన్నవారు, మమ్మల్ని కలవాలని ఎంతోకాలంగా అనుకుంటున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉడుంభిళా హోమం చేస్తున్నాం. చూచి తరించండి.

'నమస్తే  గురూజి. ఫలానా స్వామి ఈ మధ్యనే పెద్ద యాగం ఒకటి చేశాడు' అన్నాడు అన్నామలై భక్తితో బద్దలైపోతూ.

అన్నామలై అంటే నా శిష్యుడే. తమిళనాడు బీజేపీ లీడర్ అనుకునేరు. కాదు. ఇతని పేరు సుబ్బారావు. అన్నామలై అని పేరు మార్చుకున్నాడు. ఎందుకో  నాకైతే తెలీదు. పేరు మార్చుకున్నప్పటినుంచీ తిరువణ్ణామలై లో ఉంటున్నాడు.  అంతకుముందు ఉద్యోగం చేసేవాడు, 

'ఎన్నాళ్ళు చేస్తావ్ వెధవ ఉద్యోగం? మానెయ్' అని నేనే చెప్పాను. మానేశాడు.

నేను మాత్రం చక్కగా రిటైరయ్యేదాకా ఉద్యోగం వెలగబెట్టాను. కానీ అందర్నీ మాత్రం ఉద్యోగాలు మానిపిస్తుంటాను. అది నా హాబీ. 

' ఆ తర్వాతేం చెయ్యాలి? అని తనూ అడగలేదు.

తను అడగలేదు గనుక నేనూ చెప్పలేదు.

ప్రస్తుతం తిరువణ్ణామలై లో కొండకి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. మిగతా సమయంలో ఏం చేస్తాడో నేనడగను. తను చెప్పడు.

మన సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం.

'ఏంటి స్వామీజీ హోమం చేశాడా? అందులో వింతేముంది? గౌరవనీయులైన నేటి స్వామీజీలు చెయ్యగలిగింది అంతే కదా. చెయ్యనీ' అన్నాను.

'దానివల్ల లోకకల్యాణం అవుతుందని ఆయన భక్తులందరూ తెగ నమ్ముతున్నారు' అన్నాడు.

'ఇప్పటికి అయిన కల్యాణాలు చాల్లే. కొత్త కొత్త కల్యాణాలెందుకు?' అన్నాను.

'అదేంటి గురూజీ. అలా తేలిగ్గా తీసేశారు. కొన్ని కోట్ల ఖర్చు అయింది  ఆ హోమానికి' అన్నాడు కోపంగా.

'ఏం నీ చెయ్యి కూడా కాలిందా హోమంలో?' అడిగాను.

'ఆబ్బె లేదు. నా దగ్గరేముంది బూడిద?' అన్నాడు అన్నగారి స్టైల్లో.

'పోనీ అంతంత పెద్ద మాటలు ఎందుకులేగాని. ఆ హోమంతో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపమను. ఆ తర్వాత లోకకల్యాణం సంగతి చూడొచ్చు' అన్నాను.

' కళ్యాణం చేయడం తేలిక, యుద్ధం ఆపడం కంటే' అన్నాడు సీరియస్ గా.

'అంతేలే. ఆ తర్వాత ఎలాగూ మొదలయ్యేది యుద్ధమేగా' అన్నాను.

'సరే గురూజీ. ఇదంతా ఎందుకు? మనం కూడా ఒక పెద్ద హోమం చేద్దాం' అన్నాడు.

'ఎవరో వాత పెట్టుకుంటే మనం కూడా పెట్టుకోవాలా నీకసలు బుద్దుందా?' అరిచాను కోపంగా.

'కాదు కాదు గురూజీ. ప్లీజ్. మనం పాపులర్ కావాలంటే ప్రస్తుతం ఇదొక్కటేమార్గం' అన్నాడు.

'ముందు పాపులర్, ఆ తర్వాత బాటా, ఆ పైన అంబాసిడర్. ఈ గోల మనకెందుకు చెప్పు. ఏం పాపులర్ కాకపోతే నష్టం ఏంటి?' అన్నాను విసుగ్గా.

'ప్లీజ్. నాకోసం కాదనకండి. కావాలంటే మీ పేరుమీద  ఇంకొక నాలుగు ప్రదక్షిణాలు చేస్తా కొండకి' అన్నాడు ఉక్రోషంగా.

నిజంగా చేస్తాడేమో అని తెగ భయమేసింది. ఆ పాపం నాకెందుకులే అని ఇలా చెప్పాను.

'సరే. అయితే విను మనం చెయ్యబోయే హోమం మామూలుగా ఉండదు. కళ్ళు గిర్రున తిరగాల్సిందే' అన్నాను.

'ఎవరికీ?' అడిగాడు అనుమానంగా.

'చేసేవాళ్ళకి. ఎందుకంటే హోమం చేసిన పదిరోజులూ కటిక ఉపవాసం ఉండాలి. నీళ్లు మాత్రం బిందెలు బిందెలు తాగొచ్చు, అయితే, బాత్రూంకి మాత్రం పోకూడదు' అన్నాను.

'అప్పుడు కళ్ళు తిరగడం ఒక్కటే జరిగి ఆగదేమో?' అన్నాడు.

'ఏం జరిగినా సిద్ధపడేవాడే ఇందులోకి దిగాలి' అన్నాను.

' ఒకే. మరి చూసేవాళ్ళకి ఏమౌతుంది?' అడిగాడు. 

'ఇదేం హోమమో తెలిస్తే వాళ్ళకీ తిరుగుతాయ్ కళ్ళు' అన్నాను.

'త్వరగా చెప్పండి గురూజీ. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా' పెద్దగా అరిచాడు.

'దానిపేరు ఉడుంభిళా హోమం' అన్నాను.

'ఆమ్మో. వినడానికే భయమేస్తోంది. ఏదో క్షుద్రహోమంలాగా ఉందే?' భయపడ్డాడు.

'అర్భకుడా ! పేరుకే భయపడేవాడివి, ఇక డొనేషన్స్ ఎలా కలెక్ట్ చేస్తావురా?' గర్జించాను.

'డొనేషన్సా? అదేంటి గురూజీ?' నసిగాడు అయోమయంగా.

'మరి ఏమీ లేకుండా హోమం ఎలా అవుతుందిరా అమాయకుడా? అందులో ఇది ఆషామాషీ హోమం కాదు.  ఉడుంభిళా హోమం. పదికోట్లు అవుతుంది' అన్నాను.

'ఏంటి డబ్బులే?' గుడ్లు తేలేశాడు.

'కాదు గులకరాళ్లు' అన్నా నవ్వుతూ. 

'అలా కాదు గురూజీ. ఇంకో మాట చెప్పండి. ఇప్పుడే టీవీలో ఆ హోమం చూశాను. నేను తట్టుకోలేను. ఎలాగైనా హోమం చేసే తీరాలి' బ్రతిమాలాడు. 

'ఏంటి బిడ్డా బేరం చేస్తున్నావ్? సంతమార్కెట్లో సన్నజాజులు అమ్ముకునేదానిలాగా కనపడుతున్నానా? బేరాల్లేవ్. పదికోట్లు అంతే. కావాలంటే కమీషన్ క్రింద ఒకటి తీస్కో' అన్నాను కోపంగా.

'సరే గురూజీ. ఇది బాగుంది. ఆ డబ్బుతో ఒక కారు కొనుక్కుని కార్లో చేస్తా ప్రదక్షిణాలు' అన్నాడు సంతోషంగా.

'డబ్బుకోసమే కదురా నీ ప్రదక్షిణాలు. అది వచ్చాక కూడా మళ్ళీ అవేనా?  ఎదురుగా ఉంటే, ఒకే కిక్కుతో కిర్గిస్థాన్ పంపి ఉండేవాడిని నిన్ను'  అనేశాను.

' సర్లే ఏదో ఒకటి చేసుకోండి. ఇంతకీ మన హోమం వివరాలు చెప్పండి' అడిగాడు.

'విను బిడ్డా. ఈ హోమాన్ని రామాయణకాలంలో కుంభకర్ణుడు చేశాడు' అన్నాను.

'ఆ తర్వాత తిని గుర్రు పెట్టాడా?' అడిగాడు మహా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని.

'మూర్ఖుడా ! ఎగతాళి చెయ్యకు. తాళి తెగిపోతుంది' అన్నాను.

'ఎవరిదీ? నాదా, కుంభకర్ణుడిదా?' అడిగాడు రోషంగా.

'ఆవేశంలో జెండర్స్ మర్చిపోతున్నావ్ బిడ్డా. మీది కాదు, మీ ఆడోళ్ళది' అన్నాను. 

'అమ్మో గురూజీ. వద్దు శపించకండి. చెప్పండి' అడిగాడు వినయంగా.

'అలా రా దారికి. ఆ కాలంలో కుంభకర్ణుడు చేశాడు. ఇప్పుడు మనం చేస్తున్నాం. మధ్యలో ఎవరూ లేరు' అన్నాను.

'ఇంద్రజిత్తు నికుంభిలా హోమం చేశాడని రామాయణంలో చదివాము. మరి కుంభకర్ణుడు ఇలాంటి హోమం చేసినట్టు ఎక్కడా లేదే?' అన్నాడు అనుమానంగా.

'ఏంటి అనుమానిస్తున్నావా? చేశాడు. కానీ, వాల్మీకి వ్రాయడం మర్చిపోయాడు. అలా మర్చిపోయానని నిన్న రాత్రి నాకు కలలోకొచ్చి చెప్పాడు. ఎన్నని గుర్తుపెట్టుకోగలడు పెద్ద వయసులో?' అరిచాను కోపంగా.

'వాల్మీకి మర్చిపోయాడా? భలే ఉంది గురూజీ. అయినా, ఇలాంటి హోమాలు ఎందుకు గురూజీ? కాస్త సాత్వికంగా  మంచిగా ఉండేవి చెయ్యవచ్చు కదా ? రాక్షసులు చేసినవి ఎందుకు?' అడిగాడు భయంగా.

'దేవతల రోజులు పోయాయి బిడ్డా.  ఇప్పుడు అందరూ రాక్షసులే. కనుక రాక్షస హోమాలే చెయ్యాలి. నేటి కాలంలో భజనలు, పూజలు, హోమాలు, ప్రార్ధనలు ఏవైనా రాత్రిపూటే బిడ్డా.  మన పురాణాల ప్రకారం రాత్రిళ్ళు పూజలు చేసేది రాక్షసులే. అందుకే నేటి రాక్షసకాలానికి రాక్షసహోమాలే కావాలి గాని, సాత్వికహోమాలు పనికిరావు.  సాత్విక హోమాలకు డొనేషన్లు రావు బిడ్డా. అందుకే ఇలాంటి భయంకరహోమాలు చెయ్యాలి. జనాన్ని భయపెట్టాలి. అప్పుడే డబ్బులు రాల్తాయి. అవి కూడా మాలాంటి సర్వసంగపరిత్యాగులైన స్వామీజీలే చెయ్యాలి, వాటికి డొనేషన్లు ఇచ్చి మీలాంటివారు తరించాలి. మేము అన్నీ వదిలేసి సన్యాసం స్వీకరించింది ఎందుకు? ఇలాంటి హోమాలు చెయ్యడానికే కదా ! అంతే, మారు మాట్లాడకు' అన్నాను వీరావేశంతో ఊగిపోతూ.

'సరే స్వామీ. మీ అంతటివారు చెప్పాక తప్పుతుందా? శాంతించండి. ఇంతకీ ఏ దేవతకు ఈ హోమం?' అడిగాడు.

'ఏ దేవతేమిట్రా మూర్ఖుడా? ఉడుంభిళా దేవత. పేరులోనే ఉందిగా' అన్నాను.

'ఆమె ఎలా ఉంటుంది గురూజీ? ' అన్నాడు.

'పక్కా నాటు క్షుద్రదేవతలాగా ఉంటుంది. నక్క మొహం, కోతి శరీరం, పులిగోళ్ళు, ఏనుగు తొండం, డైనోసార్ తోక, ఒంటినిండా ఎలుగుబంటి బొచ్చు, పదికాళ్ళు, నలభై చేతులు ఉంటాయి బిడ్డా' అన్నాను.

'ఎవడు సార్ ఈ ఆకారాన్ని మొదటిసారి ఊహించిన దరిద్రుడు? వాడి మైండు అంత కుళ్లిపోయిందన్నమాట?' అడిగాడు అన్నామలై.

'అది నేనే' అని చెప్పడానికి ప్రిస్టేజి అడ్డొచ్చింది.

'ఏమో మరి? నాకేం తెలుసు? మన శాస్త్రాలలో అలా చెప్పబడి ఉంది. ఏ శాస్త్రాలు? అని మాత్రం అడక్కు. నాకూ తెలీదు. ఏదేమైనా మనం హోమం చేసే తీరాలి. నువ్వు పదికోట్ల పనిమీదుండు' అన్నాను తెలివిగా.

'అదికాదు గురూజీ. చక్కగా రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు ఇలాంటి శాంతస్వరూపాలు మనకు ఉండగా, ఇటువంటి క్షుద్ర ఆకారాలున్న దేవతల పూజలు, హోమాలు ఎందుకు గురూజీ? నాకు భయమేస్తోంది. నేను చెయ్యను' అన్నాడు.

'భయపడుతున్నావా? బద్దలైపోతావ్ జాగర్త, మన దగ్గరకి రావడమే గాని, పోవడం నీ చేతుల్లో లేదు బిడ్డా. ఇంత చేతకానివాడివి నన్నెందుకు నిద్రలేపావు మరి? నువ్వు చేసి తీరాల్సిందే.' ఉరిమాను.

'నిద్రలేపడమేంటి గురూజీ?' అడిగాడు భయంభయంగా.

'అంతేమరి. నన్ను లేపడం,  ఉడుంభిళను లేపడం రెండూ ఒకటే, ఆమె నాలోనే ఉందిరా. లేచాక మాకు శాంతి జరగాల్సిందే' అన్నాను. 

'సరే గురూజీ. మీ భయంతో ఒప్పుకుంటున్నాను. ఇంకొక్క సందేహం' అడిగాడు.

' త్వరగా ఏడువ్' అన్నాను.

'ఈ హోమం చేస్తే ఏం జరుగుతుంది?' అడిగాడు భయంభయంగా.

'ఏం జరిగేదేంటిరా అమాయక శిఖామణి? లోకకల్యాణం జరుగుతుంది' అన్నాను యమా సీరియస్ గా.

'ఎన్నిసార్లు జరుగుతుంది స్వామీ లోకకల్యాణం?' అడిగాడు తెగించి.

'వెధవ కళ్యాణమేగా ఎన్నిసార్లైనా జరుగుతుంది' అన్నాను.

'అదికాదు. గురూజీ. ఎవరేం  చేసినా, 'లోకకల్యాణం కోసమే' అంటున్నారు. అదేమో జరుగుతున్నట్టు ఎక్కడా కనపడటం లేదు. 'ఏసు త్వరగా వచ్చుచున్నాడు' అని కిరస్తానీలు రెండు వేల ఏళ్ళనుంచీ చెబుతున్నట్లే ఇదికూడా ఉంది. ఆయనేమో అడ్రస్ లేడు. అదేవిధంగా,  అసలు లోకకల్యాణం అనేది ఉందా?' అన్నాడు ఏడుస్తూ. 

'పాపం ఇంతగా ప్రాధేయపడుతున్నాడు, ఎక్కువగా ఏడిపించడం మంచిది కాదు, నిజం చెప్పేద్దాం' అనిపించింది.

గొంతు  తగ్గించి, ' చూడు బిడ్డా. అసలు నిజం ఇప్పుడు చెబుతున్నా విను. లోకకల్యాణం కాదు, లోటస్ పాండూ  కాదు. నీకూ నాకూ అవుతుంది కళ్యాణం' అన్నాను.

షాకయ్యాడు ఆ మాటకి.

'అదేంటి గురూజీ. ఈ మాట చాలా దరిద్రంగా ఉంది' అన్నాడు.

అతని డౌటు నాకర్ధమైంది.

'అది కాదురా దరిద్రుడా ! నీకూ నాకూ విడివిడిగా అవుతుంది. అంటే మన పంట పండుతుందని అర్ధం. ప్రదక్షిణాలు ఎక్కువై నీ మతి మలేషియా అయిపోయింది. హోమానికి మహా అయితే నాలుగు కోట్లు అవుతుంది. మిగతా ఆరు కోట్లు మనకేగా. మన లైఫు సెటిలైపోతుంది. లేకపోతే, మనల్ని నమ్ముకున్నవాళ్ళకి వేరే ఆశ్రమాలు కట్టించి ఇవ్వవచ్చు. అలా జరుగుతుందన్నమాట మన కళ్యాణం' అన్నాను.

'ఆమ్మో ఉడుంభిళా హోమంలో ఇంత ఉడుంపట్టు ఉందన్న మాట" అన్నాడు.

'ఉందో లేదో నువ్వే చూద్దువుగాని, ముందు డొనేషన్ల పని మీదుండు' అన్నాను.

'ఓకే గురూజీ. కానీ నా వాటా ఒక కోటి సరిపోదు. ఇంకోటి కూడా చూడండి' అన్నాడు.

'సర్లే. ఏదోకటి ఏడుద్దువుగాని, ముందిది ఏడువ్' అన్నాను.

అన్నామలై ఫోన్ పెట్టేశాడు.

నేను ఈజీచైర్లో వెనక్కు వాలి, 'జై ఉడుంభిళా' అని అరుస్తూ తృప్తిగా కళ్ళుమూసుకున్నాను.