'బుక్ ఫెయిర్ లో శివరాం సార్ కనిపించాడు' అన్నాడు రవి పొద్దున్నే ఫోన్ చేసి. గొంతు చూస్తే బాగా ఉద్వేగంతో ఉన్నాడు.
రవి ఈ మధ్యన ఫోన్ చెయ్యడం తగ్గించాడు. దానికొక కారణముంది.
ఇంతకు ముందు ఇద్దరం సర్వీసులో ఉండేవాళ్ళం గనుక, పొద్దున్నే వాకింగ్ సమయంలో మాట్లాడేవాడు. నేనుకూడా ఏదో ఒక పని చేసుకుంటూ తనతో మాట్లాడేవాడిని. ఇప్పుడేమో తను కూడా రిటైరయ్యాడు. కానీ వాకింగ్ మానలేదు. మనకేమో వాకింగ్ అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. కానీ ప్రస్తుతం ఆశ్రమవాసినయ్యాను గనుక, మన టైం టేబుల్ వేరుగా ఉంటుంది,
ఉదయం మూడు నుంచి తొమ్మిదివరకూ జపమో, తపమో, మంత్రమో, తంత్రమో, యోగమో, వియోగమో ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఫోన్ కాల్స్ మాటలాడటం కష్టం. అయినా సరే, ముప్పై ఏళ్ల స్నేహం కదా అని అప్పుడప్పుడూ మాత్రం ఫోనెత్తుతూ ఉంటాను.
అప్పుడు ఇలాంటి షాకింగ్ న్యూసులు చెబుతూ ఉంటాడు.
ఒక రకంగా చెప్పాలంటే, బయటి ప్రపంచంతో నాకున్న కొన్ని సంబంధాలలో రవి ఒకడు. లేకపోతే, ప్రపంచంలో ఏం జరుగుతోందో మనకు తెలీదు,
మనకు అనవసరం కూడా.
'ఎవరా శివరాం ఏమా కథ' అన్నాను కూల్ గా.
'శివరాం కాదు శివరాం సార్ అనాలి' అన్నాడు ఏదో నేరం జరిగిపోయినట్టు బాధపడుతూ.
'ప్రతివాడినీ సార్ అనాల్సిన ఖర్మ నాకేంటి? విషయం చెప్పు' అన్నాను.
'శివరాం సార్ బుక్ ఫెయిర్ కొచ్చి, ఆధ్యాత్మిక పుస్తకాలు బోలెడన్ని కొనుక్కుని ఒక బండిల్ గా చేసి కారులో పెట్టుకుని తీసికెళ్ళాడు. నేనే కళ్లారా చూశాను' అన్నాడు.
'ఇందులో వింతేముంది? ఎంతోమంది సాహిత్యాభిమానులు అలా చేస్తూ ఉంటారు, బుక్ ఫెయిర్ పెట్టిందే బుక్స్ కొనుక్కోడానికి' అన్నాను.
'అది కాదు. అందరూ రావడం వేరు. సార్ రావడం వేరు' అన్నాడు రవి.
'ఏం? అందరూ నేలపైన నడిస్తే ఈయన గాలిలో ఎగురుకుంటూ వస్తాడా?' అడిగాను.
'అదికాదు. ఈయన అవతారం కదా? ఈయన బుక్ ఫెయిర్ కి రావడం ఏంటి?' అన్నాడు ఏడుపు గొంతుతో.
నవ్వీ నవ్వీ పొట్ట చేత్తో పట్టుకున్నాను.
'అవతారమా? ఎవరి అవతారం?' అన్నాను నవ్వాపుకుంటూ.
'వెంకటేశ్వరస్వామి అవతారం' అన్నాడు కూల్ గా.
'ఏంటి పొద్దున్నే పిచ్చెక్కిందా? శివరాం సార్, వేంకటేశ్వరస్వామి అవతారమా? సరే అయితే అయ్యాడు. నువ్వెందుకు దానికి బాధపడటం?' అన్నాను నవ్వుతూ.
'అవును. అలా అని పెద్ద ప్రచారం జరుగుతోంది. ఆయనకు చాలామంది భక్తులు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ ఇదంతా నిజమని నేనుకూడా నమ్మాను. ఇప్పుడు చాలా సిగ్గుగా ఉంది' అన్నాడు.
'ఒకవేళ అవతారమే అయితే, తిరుమల కొండమీదకి పోయి కూచోమను. మనకెందుకు?' అన్నాను.
'అదికాదు. నా డౌటేంటంటే, ఆయన వెంకటేశ్వరస్వామి అవతారమే అయితే, బుక్ ఫెయిర్ లో అన్ని స్టాల్సూ తిరిగి ఆధ్యాత్మిక పుస్తకాలు కొనడం ఏమిటి? ఇదే నాకర్ధం కావడం లేదు' అన్నాడు రవి.
'ఇందులో అర్ధం కావడానికేముంది? వెరీ సింపుల్. స్వామికి కొండమీద బోరు కొట్టింది. హైద్రాబాద్ బుక్ ఫెయిర్ కొచ్చి బుక్స్ కొనుక్కుంటున్నాడు. అంతే' అన్నాను.
'జోకులాపు. నాకేమనిపిస్తోందో చెప్పనా? ఈయన అవతారం అనేది కొంతమంది మోసగాళ్ల ప్రచారం మాత్రమే. అది నిజం కాదు. అది కేవలం బిజినెస్ ప్రొమోషన్, అంతే' అన్నాడు.
'ఈ విషయం నీకెప్పుడో చెప్పాను. నువ్వే మర్చిపోయి, ఇవాళ మళ్ళీ నాకే తిరిగి చెబుతున్నావు, రిటైరైన తర్వాత నీ మైండు మైదాపిండి అయిపోయింది, అందుకే ఆశ్రమానికొచ్చి నా దగ్గర ఒక నెలరోజులుండు. మళ్ళీ యంగ్ గా తయారౌతావ్' అన్నాను కోపంగా.
'అన్నీ తెలిసినవాడు నీలాగా పుస్తకాలు వ్రాయాలి గాని, పుస్తకాలు కొనుక్కు పోవడమేంటి? అంటే, ఆ పుస్తకాలన్నీ చదివి, అందులో విషయాలకు కొంత మసాలా కలిపి తన సోకాల్డ్ భక్తులకు చెబుతున్నాడన్నమాట శివరాం సార్?' అన్నాడు రవి.
'ఎవడైనా చేస్తున్నది అదే. చాలామంది మన స్టాల్లో పుస్తకాలు కొనేవాళ్ళు కూడా అదే చేస్తున్నారు. కొంతమంది ఓపెన్ గా మనకావిషయాన్ని చెప్పారు కూడా. అంతెందుకు? గత పదేళ్లుగా మన బ్లాగు నుంచి ఎంత మెటీరియల్ సినిమాలకు, యూట్యూబు వీడియోలకు ఉపయోగపడిందో తెలుసా నీకు?' అడిగాను.
'మరి ఇలాంటి మోసగాళ్ల వలలో పడి ఎంతమంది బకరాలైపోతున్నారో తలుచుకుంటేనే బాధగా ఉంది' అన్నాడు దాదాపు ఏడుపుగొంతుతో.
'మరీ అంత బాధపడకు. వినేవాళ్ళు నిజమనుకుంటారు' అన్నాను.
'అదికాదు. ఈ సమస్యకు పరిష్కారం కావాలి. లేకపోతే నాకు నిద్రపట్టదు. నా సంగతి నీకు తెలుసు కదా?' అన్నాడు.
రవికి ఓవర్ యాంగ్జైటీ బాగా ఎక్కువ. దేనినీ తట్టుకోలేడు. ఒప్పుకోలేడు. తన సంగతి నాకు బాగా తెలుసు.
'సరే. ఈ సమస్య పరిష్కారానికి నేనొక సలహా చెప్పనా?' అన్నాను.
'చెప్పు'.
'విను. మొగుడి సంగతి పెళ్ళానికి తెలిసినట్లు ఎవరికీ తెలీదు. అవునా?' అన్నాను.
'అవును' ఒప్పుకున్నాడు.
'అలిమేలుమంగమ్మ అవతారాన్నని చెప్పుకుంటూ చాలాకాలంగా ఒక అమ్మ జనానికి బాగా టోపీ వేస్తున్నది. ఆమె ఎవరో నీకూ తెలుసు నాకూ తెలుసు. ఆమెనడిగితే సరి. శివరాం సార్ వెంకటేశ్వరస్వామా? కాదా? తేలికగా చెప్పేస్తుంది. తన మొగుడి సంగతి తనకు తెలుస్తుంది కదా? ఇంతకంటే యాసిడ్ టెస్ట్ ఇంకేముంటుంది?' అన్నాను.
'భలే ఐడియా ! నేను రేపే మంగమ్మమాత దగ్గరికి వెళ్లి ఈ విషయం అడిగేస్తాను. ఆమె శిష్యుడు ఒకాయన నాకు బాగా పరిచయమే' అన్నాడు రవి.
'ఇప్పుడు నాదొక సందేహం?' అన్నాను.
'నీకు సందేహమా? చెప్పు వింటాను' అన్నాడు రవి.
'ఒకవేళ శివరాం సార్ వెంకటేశ్వరస్వామే అని మంగమ్మమాత చెప్పిందనుకో, అప్పుడు మంగమ్మమాతకే ప్రాబ్లమ్ అవుతుంది. వీళ్ళిద్దరూ విడివిడిగా ఎందుకుంటున్నారు? ఉండకూడదు కదా? కాబట్టి ఇద్దరూ అర్జెంటుగా మేరేజి చేసుకోవాలి. కొండపైన సహజీవనం స్టార్ట్ చేయాలి. అలా కాకుండా, 'ఈయన అవతారం కాదు' అని మంగమ్మ మాత చెప్పిందనుకో, అప్పుడు ఈయనకు ప్రాబ్లమ్ వస్తుంది. ఈయన తన షాపు మూసుకోవాల్సి వస్తుంది' అన్నాను.
'ఇప్పుడు నాదొక డౌటు' అన్నాడు.
తను కూడా నాలాగే లా గ్రాడ్యుయేటే. మా బుర్రలన్నీ ఒకే విధంగా ఆలోచిస్తాయి మరి.
'ఏంటది చెప్పు' అడిగా టీ సిప్ చేస్తూ.
'ఏం లేదు? అసలు మంగమ్మమాత అలిమేలుమంగే అని గ్యారంటీ ఏముంది? ఆమె ఇచ్చిన సర్టిఫికెట్ ను మనం వాలిడ్ గా ఎలా తీసుకోగలం? ఆమెనే నకిలీ కావచ్చు కదా?' అన్నాడు రవి.
'వెరీ గుడ్ పాయింట్. ఆమె అవతారమా కాదా అని శివరాం సార్ నే అడుగుదాం. పెళ్ళాం సంగతి మొగుడికి తెలీదా?' అన్నాను.
'ఇద్దరూ జినైన్ అయితే నువ్వు చెప్పేది ఓకే, కానీ ఇద్దరూ ఫేక్ అయినపుడు ఎలా? ఎవరి మాటను నమ్మాలి?' అడిగాడు.
'అప్పుడు ఇద్దరి మాటనూ నమ్ముదాం. ఇద్దరికీ దగ్గరుండి మేరేజి చేయించి తిరుమల కొండమీదకు తీసికెళ్ళి అక్కడ అడివిలో వదిలేద్దాం. అదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం' అన్నాను.
పెద్దగా నవ్వాడు రవి.
'ఎక్కడ వదిలేద్దాం? మొన్నా మధ్య ఒక చిన్నపిల్లను పులి ఎత్తుకుపోయింది చూడు. ఆ ప్రాంతంలో వదిలేద్దామా? ఒక ఏడాదిపాటు ఏ పులీ ఇక భక్తుల జోలికి రాకుండా ఉంటుంది' అన్నాడు.
'అంతే, వెరీ గుడ్ ఐడియా. నువ్వు రేపే శివరాం సార్ ని కలువు. ఆ తర్వాత మంగమ్మమాత దగ్గరికి వెళ్లి ఆ పనిమీదుండు' అన్నాను.
'థాంక్స్ రా. మంచి ఐడియా ఇచ్చావ్. రిటైరయ్యాక పనీ పాటా లేకుండా పోయింది. ఈ పనిమీదుంటాను' అని ఫోన్ పెట్టేశాడు.
నేను ఎదురుగా ఉన్న వెంకటేశ్వరస్వామి ఫోటోకి భక్తిగా నమస్కరించుకుని, 'స్వామీ ఏమి నీ లీల?' అనుకున్నాను.
'నా లీల కాదు నాయనా. ఇదంతా మీ గోల' అంటూ స్వామి స్వరం నా చెవులలో ప్రతిధ్వనించింది.