నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, ఫిబ్రవరి 2024, బుధవారం

మీ దగ్గర చేతబడి ఉందా?

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగిసింది.  అన్ని స్టాల్స్ లాగే మా స్టాల్ కూడా మూసేసి ఇంటిదారి పట్టాము.

'ఎలా ఉంది ఈ పదిరోజుల అనుభవం?' మూర్తిని ఫోన్ లో అడిగాను

'చాలా దారుణంగా ఉంది. ఒక పక్కన ఎండలు, మరోప్రక్కన జనాల విచిత్ర మనస్తత్వాలు, మైండు బ్లాంక్ అయిపొయింది' అన్నాడు.

ఈసారి కూడా మాకు పడమర వైపు స్టాలే వచ్చింది. మధ్యాహ్నం నుండి అందరికీ ఎండ పేలగొట్టింది.

'ఏమైంది? వింతమనుషులందరూ కనిపించారా?' అడిగాను.

'అవును. చాలామంది మాకు బోధలు చెయ్యడానికే స్టాల్ దగ్గరకు వచ్చినట్లుగా ఉన్నారు' అన్నాడు.

'ఇప్పుడు అందరూ యూట్యూబ్ యూనివర్సిటీ పీ హెచ్ డీ లే. అందులో చూడటం, ఇక కనిపించిన వారికందరికీ బోధలు చెయ్యడం. ఇదే ప్రస్తుతం నడుస్తున్నది' అన్నాను.

'కొందరైతే, 'ఈయనొక క్రొత్త గురువా? ఇప్పటికి ఉన్నవాళ్లు చాలరా? ఈయనను మేమెందుకు నమ్మాలి? రామాయణం భారతాలలో లేనిది క్రొత్తదేమైనా ఈయన చెబుతున్నాడా? అవి చాలవా? కొత్తకొత్తవి ఎందుకు?' అన్నారు.

'రామాయణ భారతాలకంటే ముందు వేదాలున్నాయి. మరి వేదాలలోనే అంతా ఉంది కదా? ఇవెందుకు?' అని నువ్వు అడిగి ఉండాల్సింది' అన్నాను.

మరి కొంతమంది, 'బుద్ధుడు మాకు నచ్చడు' అంటూ ధమ్మపదం పుస్తకాన్ని అటూ ఇటూ తిప్పి అవతలపడేశారు' అన్నాడు.

'అవును. సాంప్రదాయ చాదస్తపు హిందువులకు బుద్ధుడు నచ్చడు. మనకు నచ్చుతాడు. మనకే కాదు, బుద్ధుని తత్త్వాన్ని అర్ధం చేసుకుంటే ఎవరికైనా నచ్చుతాడు' అన్నాను.

ఇంకొకాయనైతే మీ ఫోటోను చూస్తూ, ' నేనుకూడా ఇలా ఒక గ్రూపు మెయింటెయిన్ చేద్దామని చాలాకాలం నుండి అనుకుంటున్నాను. కుదరడం లేదు. ఈ లోపల ఎవరు పడితే వాళ్ళు ఆశ్రమాలు పెట్టేస్తున్నారు' అంటూ తెగ ఫీలై పోయాడు. తన జెలసీని కనీసం లోపల దాచుకోవడం కూడా అతనికి కుదరడం లేదు' అన్నాడు మూర్తి.

'పాపం ! అంత కుతకుత ఉందన్నమాట లోపల. కూల్ డ్రింక్ ఒకటి ఆఫర్ చెయ్యకపోయావా. కొంచెం చల్లబడేవాడు' అన్నాను.

'ఒకామె అయితే, 'నేను గురువుల దగ్గరకు వెళ్ళను. వాళ్లే నన్ను వెతుక్కుంటూ రావాలి' అంది మన స్టాల్ దగ్గర కొచ్చి.' అన్నాడు మూర్తి.

'చాలా కరెక్ట్ గా చెప్పింది. ఎవడికి అవసరమైన దానిని వాడు వెతుక్కుంటాడు, తప్పేముంది?' అన్నాను.

'ఇంకొకడైతే రావడం రావడం 'చేతబడి ఉందా?' అని అడిగాడు. కనీసం 'చేతబడి మీద బుక్స్ ఉన్నాయా' అని కూడా అడగలేదు. 'చేతబడి ఉందా' అంట, ఐస్ క్రీమ్ ఉందా అన్నట్టు' అన్నాడు మూర్తి.

'లోపలుంది పిలుస్తా ఉండండి' అని మన రమేష్ ని పిలిచి ఉండాల్సింది. వాడికి స్పాట్లో చేతబడి చేసి ఉండేవాడు' అన్నాను.

'మరీ ఇంత దరిద్రంగా ఉన్నారేంటి మనుషులు?' మూర్తికి అనుమానం వచ్చింది.

'అంతే. 'పాపట్లో నెరిసిన తర్వాత పాప పతివ్రత అయింది' అని సామెతుంది. అలాగే, అన్ని రకాలుగా భ్రష్టు పట్టిన తర్వాతే ఆధ్యాత్మికంలోకి వస్తారు. అదంతే' అన్నాను.

' అసలైన తత్త్వం ఎవరూ అడగడం లేదు. ఎవరిని చూసినా, పూజలు, మంత్రాలు, కుండలిని, తంత్రం, రెమెడీలు, క్షుద్రవిద్యలు, ఇదే గోల ! ఇదేం ఖర్మ గురూజీ. లోకం ఇలా తయారైంది?' అన్నాడు 

' ఇలాగే ఉంటుంది. అసలు విషయం చెప్తా విను. ఆధ్యాత్మికులమని చెప్పుకునేవారిలో 50 శాతం మంది నిజానికి మెంటల్ పేషంట్లు, వారికి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్లకు ట్రీట్మెంట్ అవసరం. మరొక 45 శాతం మంది విజ్ఞానప్రదర్శకులు, మోసగాళ్లు. ఆ 50 మందిని ఈ 45 మంది మోసం చేస్తుంటారు. ఎక్కడో విని, లేదా చదివి, వీరికి చెబుతుంటారు. అనుభవం ఉండదు. వారికి ఆసరా కావాలి. వీరికి గొప్పలు కావాలి.  మిగతా ఒక్క అయిదు శాతం మాత్రమే నిజమైన జిజ్ఞాసువులు, సాధకులు ఉంటారు. ఎక్కడైనా ఇంతే' అన్నాను.

'ఆ అయిదు శాతం ఎక్కడుంటారు?' అడిగాడు.

'మన పంచవటిలో ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, బయట అంతా నకిలీనే. కాకపోతే ఆ 95 శాతం కూడా 'మేమే అసలైన వాళ్ళం ' అని చెబుతారు. అసలైన అయిదు శాతాన్ని నకిలీ అంటారు. అదే కలిమాయ' అన్నాను.

'అర్ధమైంది గురూజీ, మరి ఇదంతా తెలిసికూడా మాచేత స్టాల్ ఎందుకు పెట్టించారు?' అడిగాడు.

'జస్ట్ ఫర్ ఫన్. మెంటల్ పేషంట్లలో ఎన్ని రకాలుంటారో మీకు ప్రాక్టికల్ గా అర్ధం కావడం కోసం పెట్టించాను. ఈ పదిరోజులలో బాగా అర్థమైందా?' అడిగాను.

'అయింది, ఇప్పుడు మమ్మల్నేం చెయ్యమంటారు?'

'ఏమీ చెయ్యద్దు. జస్ట్ ఎంజాయ్ లైఫ్. కొన్నాళ్లపాటు హాయిగా వేళకు తిని, నిద్రపొండి. మళ్ళీ వచ్చే నెలలో మన స్పిరిట్యువల్ రిట్రీట్ ఉంది. దానికి రెడీ అవ్వండి' అని ఫోన్ కట్ చేశాను.