'బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ' అని మనకొక సామెతుంది. 'కోడలు అడుగుపెట్టినవేళ' అని కూడా ఇంకొకటుంది. అంటే, కొంతమంది ఇంటిలో అడుగుపెడితే, మంచో చెడో కొన్ని సంఘటనలు తప్పకుండా జరుగుతాయని అర్ధం. ఈ సామెతల వెనుక చాలా అనుభవము, పరిశీలన, చరిత్ర ఉన్నాయి. ఇవన్నీ నిజాలే.
మన పల్లెటూరి సామెతలను మనం ఏమాత్రమూ నమ్మం. కానీ ఇంగ్లీష్ వాడొచ్చి, Coming events cast their shadows అంటే మాత్రం 'అబ్బా ఎంత బాగా చెప్పాడో తెల్లోడు?' అని తెగ మురిసిపోతాం. మన సారాయి అయినా సరే, తెల్లసీసాలో ఉంటే దాని విలువ ఒక్కసారిగా మారిపోతుంది మరి !
అలాంటిదే 'UAE లో విపరీత వర్షాలు వరదలు' అనే న్యూస్.
ఏడాది మొత్తం ఎంత వర్షం పడుతుందో అంతకు ఒకటిన్నర రెట్ల వర్షం ఒక్క రోజులో అక్కడ పడింది. దుబాయ్ విమానాశ్రయమూ, సిటీ అన్నీ నీళ్లలో మునిగిపోయాయి. ఇదంతా ఇప్పటిదాకా UAE చరిత్రలో లేదు.
క్లౌడ్ సీడింగ్ చెయ్యడం వల్లే ఈ వర్షాలని కొందరంటే, ఉత్త క్లౌడ్ సీడింగ్ ఒక్కటే ఇంత పని చెయ్యలేదు, మారుతున్న వాతావరణం కూడా కారణమని మరికొందరి మాట !
ఇదంతా ఇలాగుంటే, దుబాయ్ లో హిందూదేవాలయం కట్టడం వల్లే ఈ వర్షాలు వరదలు వచ్చాయని కొందరు తురుష్కులు తెగ బాధపడిపోతున్నారని ఉవాచ.
దానికి మనవాళ్ళు, 'ఇంకా మరిన్ని హిందూ దేవాలయాలు కట్టండి. నెలకొక వర్షం చొప్పున వర్షాలు పడి మిడిల్ ఈస్ట్ అంతా సస్యశ్యామలం అవుతుంది' అని సలహాలిస్తున్నారు.
నిజమే కదా. మొన్న ఫిబ్రవరిలో అక్కడ హిందూదేవాలయం కట్టబడింది. వేదఘోష అక్కడ ప్రతిధ్వనిస్తున్నది. మరి వర్షాలు పడకుండా ఎలా ఉంటాయి? రెండు నెలలు తిరక్కుండా, ఆ దేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత వర్షం పడింది. దీన్నేమనాలి మరి !
ఈ మొత్తం విషయానికి మన పురాణాలతో లింకుంది.
సీతాన్వేషణలో లంకా నగరానికి వెళుతుంటే సముద్రం అడ్డుగా ఉందని, దానిని ఎండగట్టడానికి ఆగ్నేయాస్త్రం ప్రయోగించబోయాడు శ్రీరామచంద్రుడు. దానికి సముద్రుడు గడగడలాడి, వేదవిరోధులు, ధర్మవిరోధులు ఉన్న వాయవ్యదిశగా దానిని ప్రయోగించమని సూచించి, లంకకు వెళ్ళడానికి దారినిచ్చాడు. మనకు వాయవ్యమంటే భూమికి మిడిల్ ఈస్ట్ అవుతుంది. శ్రీరాముని ఆగ్నేయాస్త్ర ప్రభావం చేత సౌదీ ప్రాంతాలలో అంతా చెట్లూ చేమలూ నశించి ఎడారిగా మారిపోయింది. ఇది పురాణవచనం. ఇదంతా రామాయణంలో రికార్డ్ కాబడి ఉంది.
ఇన్ని వేల ఏళ్లకు మళ్ళీ మన దేవాలయం అక్కడ కట్టబడటం వల్ల మళ్ళీ ఆ ప్రాంతానికి శాపవిమోచనం కలిగి, శ్రీరాముని ఆగ్నేయాస్త్ర ప్రభావం నశించి, అక్కడ వర్షాలు పడుతున్నాయని మరికొందరి ఊహ. ఈ ఊహ చాలావరకూ సత్యానికి దగ్గరగానే ఉంది.
అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారో తెలుసుకోవడానికి దుర్యోధనుడు ఒక ప్లాను వేస్తాడు. ధర్మరాజు సత్యాన్ని తప్పడు గనుక, ఆయన ఎక్కడుంటే అక్కడ నెలకు నాలుగు వానలు ఖచ్చితంగా పడతాయి గనుక, ఏ రాజ్యంలో (ఏ రాష్ట్రంలో) వర్షాలు సక్రమంగా పడుతూ, పంటలు బాగా పండుతూ, ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా ఉన్నారో అక్కడ పాండవులు దాక్కున్నారని భావించాలని ఆయన సహచరులు ఆయనకు సలహా ఇస్తారు. ఇదీ నిజమే ! ఇదంతా లాజికల్ గానే ఉంటుంది.
ఎక్కడ దేవాలయాలు, దేవతా విగ్రహాలు కూలగొట్టబడతాయో అక్కడ వర్షాలు పడవని, పంటలు పండవని, కరువు కాటకాలు తాండవిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీనికి నిదర్శనాలు ఎన్నో చరిత్రలో మనకు కనిపిస్తాయి. భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా 50 ఏళ్లపాటు పరిపాలించి, లెక్కలేనన్ని దేవాలయాలను కూలగొట్టిన ఔరంగజేబు, చివరకు తన సైన్యానికే కాదు, తన బాడీగార్డ్స్ కు కూడా నెలజీతాలు ఇవ్వలేని కటిక నిరుపేద పరిస్థితిలో చనిపోయాడు. అతను రాసిన చివరిలేఖలో ఇది స్పష్టంగా ఉంది.
ఇప్పుడు మన కాంగ్రెస్ వాదులకు, లెఫ్టిస్ట్ లకు, నాస్తికులకు, హేతువాదులకు ఒక ధర్మసందేహం వస్తుంది.
'ఇదంతా నిజమైతే, మరి హైదరాబాద్ లో నీటికరువు ఎందుకు రాబోతోంది? కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఎందుకు వచ్చేసింది?బెంగుళూర్ లో బిందెడు నీటికి కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చేసింది. జనాలంతా మాల్స్ కి వెళ్లి అక్కడ టాయిలెట్స్ లో స్నానాలు చేస్తున్నారు. ఇదంతా ఎవరి శాపం? ఏ అస్త్రం ప్రభావం? చెప్పండి?' అని వారు అడుగుతారు.
దానికి మన దగ్గర ఆన్సర్ రెడీ గా ఉంది.
ఇదంతా కాంగ్రెసాస్త్ర ప్రభావం. కమ్యూనిష్టాస్త్ర ప్రభావం. బీజేపీతో విభేదించే పార్టీ అస్త్రాల ప్రభావం.
దేశాభివృద్ధిని ముఖ్యంగా చూడకుండా, సరిహద్దు రక్షణను ప్రధానంగా చూడకుండా, కులమతాలను రెచ్చగొట్టి, ఉచితపథకాలను అమలుచేస్తూ, దేశాన్ని ప్రాంతాల పరంగా చీల్చి, అప్పుల ఊబిలోకి నెట్టి, లా అండ్ ఆర్డర్ ను నీరుగార్చి, వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసిన ఘనత ఈ ప్రభుత్వాలదే. అందుకే ఈ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే నీటి కరువు వచ్చింది. అవి అల్లకల్లోలాలు అవుతున్నాయి.
మరోప్రక్కన, యోగి ఆదిత్యనాధ్ వంటి నిజమైన మహనీయులు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతూ, అప్పులరాష్ట్రం అనే బిరుదు నుండి బయటపడి, బడ్జెట్ సర్ ప్లస్ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది.
ప్రపంచదేశాల మధ్యన 75 ఏళ్ళనుంచీ నవ్వులపాలౌతున్న భారతదేశం, మోదీగారి రామరాజ్య పరిపాలనలో కేవలం 8 ఏళ్లలో ఊహించలేని అభివృద్ధిని సాధించి, అగ్రదేశాలతో సమానంగా గర్వంగా తల ఎత్తుకుని నిలబడే స్థితిలో నేడు ఉంది. ఇదే సమయంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా జరిగింది. ఇదంతా కాకతాళీయం ఎలా అవుతుంది?
ధర్మస్వరూపుడైన శ్రీరాముని దేవాలయం ఉన్నచోట, ప్రజలు ధర్మాన్ని తప్పకుండా ఉన్నచోట, ప్రకృతి కూడా తన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది. వర్షాలు ఖచ్చితంగా పడతాయి. ఇది తిరుగులేని సత్యం ! ఇప్పుడు UAE లాంటి దేశాలలో కూడా ఇది రుజువైంది.
ఇప్పుడు చెప్పండి. ఏ శాపం వల్ల కర్ణాటకలో నీళ్లు లేని పరిస్థితి వచ్చింది? తెలంగాణాలో ఎందుకు ఇప్పటికే రాబోతోంది? ఏ పార్టీ ప్రయోగించిన అస్త్రాలివి? ధర్మస్వరూపుడైన శ్రీరాముడిని, శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ద్వేషించే ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో వర్షాలు ఎలా పడతాయి? అవి సస్య శ్యామలంగా ఎలా ఉంటాయి?
రామబాణం మహిమ అంటే ఇలా ఉంటుంది. అది రాక్షసభూములను ఎడారిగా మార్చగలదు. బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపపడితే, ఎడారిలో కూడా వర్షాలను కురిపించగలదు. UAE ఉదాహరణ చాలదా? ఇంకా చాలకపోతే మరిన్ని ఉదాహరణలు భవిష్యత్తులో చూద్దురుగాని సిద్ధంగా ఉండండి !
'గ్రహబలమేమి రామానుగ్రహ బలము గాని? (What can planets do if there is Lord Rama's grace?)' అని త్యాగరాజస్వామి వంటి మహనీయులు ఊరకే అన్నారా?