Pages - Menu

Pages

21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

కాగితపు పడవలు

అంతర్జాలపు విషంతో

మెదళ్ళు నిండిపోతున్నాయి 

మనుషుల సమాజంలో

జంతువులు పెరిగిపోతున్నాయి


అహంకారాల బురదలతో

హృదయాలు కుళ్ళిపోతున్నాయి

అతితెలివి బ్రతుకులతో

వయసులు మళ్లిపోతున్నాయి


డబ్బు వెంట పరుగులలో

జీవితాలు చెల్లిపోతున్నాయి

బాంధవ్యాలు ఆవిరైపోతూ

జ్ఞాపకాలను చల్లిపోతున్నాయి


ఆధ్యాత్మికపు ముసుగులలో

ఆవేశాలు చల్లారుతున్నాయి

అజ్ఞానపు ఆకర్షణలతో

అవరోధాలు ఊరేగుతున్నాయి


మురికిగుంటల దారులలో

నీటిచెలమలెందుకుంటాయి?

బండరాళ్ళ కనుమలలో

నదుల జాడలెందుకుంటాయి?


వరద ముంచుకొస్తుంటే

కాగితపు పడవలెలా ఆదుకుంటాయి?

ఊర్లు తగలబడుతుంటే

ఉత్తమాటలెలా అక్కరకొస్తాయి?